Oct 04,2022 23:26

కాలిన గాయాలతో ఉన్న బిడ్డతో తల్లి కుమారి, ఖాళీగా ఉన్న డాక్టర్‌ కుర్చీలు

బిడ్డకు కాలిన గాయాలతో ఆసుపత్రికి వెళితే అందని వైద్యం
ఇద్దరు వైద్యాధికారుల గైర్హాజరుతో సేవలు మృగ్యం
వారపుసంత రోజున విధులకు డుమ్మాపై ఆగ్రహం
రోగుల రిఫరల్‌కే ప్రాధాన్యత..మందులకు చీటీలు
ఇదీ పెదబయలు పిహెచ్‌సిలో వైద్యసేవల దుస్థితి
ప్రజాశక్తి- పెదబయలు :
ఒంటిపై కాలిన గాయాలతో బొబ్బర్లు పెడుతున్న రెండున్నరేళ్ల కొడుకును ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఆందోళనతో ప్రభుత్వాసుపత్రికి వైద్యానికి పరుగులెట్టింది ఆ గిరిజన మాతృమూర్తి. తీరా చూస్తూ పిహెచ్‌సిలోని ఇద్దరు డాక్టర్లు విధులకు డుమ్మా కొట్టారు. కిందిస్థాయి సిబ్బంది ఉన్నా, సరైన వైద్యం అందని స్థితి. కాలిన గాయాల మంటతో కొడుకు ఏడుస్తుంటే, దిక్కుతోచని స్థితిలో తాను ఏడుస్తూ మధ్యాహ్నం 12గంటల వరకు డాక్టర్లు కోసం వేచిచూసింది. వచ్చే పరిస్థితి కనిపించక పోవడంతో ఎఎన్‌ఎంలు చేసిన తూతూమంత్రపు వైద్యంతోనే సరిపెట్టుకుని వెనుదిరిగింది. పెదబయలు మండల కేంద్రంలోని పిహెచ్‌సిలో వైద్యసేవల దుస్థితికి ఇదో ఉదాహరణ మాత్రమే. అల్లూరి మన్యంలో నానాటికీ తీసికట్టుగా మారుతున్న వైద్యసేవలపై గిరిజనం ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. వివరాలు పరిశీలిస్తే..
మండల కేంద్రానికి కొద్దిదూరంలోనే ఉన్న సీతగుంట గ్రామానికి చెందిన లకే కుమారి అనే గిరిజన మహిళ రెండున్నరేళ్ల కొడుకు లకే గగన్‌సాయి మంగళవారం ఉదయం వేడినీళ్లు ఒంటిపై పోసుకోవడంతో పొట్టపై బొబ్బలెక్కాయి. కాలిన గాయాలతో ఏడుస్తున్న బిడ్డను ఎత్తుకుని వైద్యం కోసం స్థానిక పిహెచ్‌సికి వెళ్లింది. మరోవైపు ఉదయం 9గంటలకే రావాల్సిన ఇద్దరు మహిళా డాక్టర్లు విధులకు రాకపోవడంతో ఆవేదనగా ఎదురుచూసింది. ఆసుపత్రిలో బెడ్‌పై ఏడుస్తున్న బిడ్డను పడుకోబెడితే ఒక్కరొక్కరుగా హెల్త్‌ సూపర్‌వైజర్‌, ఎఎన్‌ఎం, ఇతర సిబ్బంది వచ్చి చూసి వెళ్లారే తప్ప, సరైన వైద్యం అందించలేదని కుమారి ఆవేదన వ్యక్తం చేసింది. అయినా మధ్యాహ్నం 12గంటల వరకు డాక్టర్లు కోసం ఎదురుచూసింది. ఎప్పటికీ డాక్టర్లు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎఎన్‌ఎం చేసిన నామమాత్రపు వైద్యంతో ఇంటికి తిరుగుముఖం పట్టింది. పిహెచ్‌సిలో గాయాల మంటతో బిడ్డ ఏడుస్తుంటే, అతడిని చూసి తల్లి కూడా కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యం అందరినీ కలచివేసినా ఏం చేయలేని దుస్థితి.
పొంతన లేని సమాధానంతో కప్పిపుచ్చే యత్నం
ఆసుపత్రిలో వైద్యం అందక చిన్నారి, ఆమె తల్లి ఏడుస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న స్థానిక విలేకర్ల బృందం, వెంటనే ఆసుపత్రికి చేరుకుని వైద్యసేవలపై ఆరాతీశారు. ఆసుపత్రిలో ఉండాల్సిన ఇద్దరు మహిళా డాక్టర్లు ఎక్కడికెళ్లారని అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే, పొంతన లేని సమాధానం చెప్పి, కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం కనిపించింది. ఇద్దరు వైద్యాధికారులూ ఫీల్డ్‌కు వెళ్లారని ఒకరు, పాడేరు వెళ్లారని ఇంకొకరు, విశాఖపట్నం వెళ్లారంటూ మరొకరు పొంతన లేని సమాధానాలతో కవర్‌ చేయాలని చూశారు.
వారపుసంత రోజుల వైద్యుల గైర్హాజరుపై ఆగ్రహం
వారపుసంత రోజున పెదబయలు పిహెచ్‌సికి ఆంధ్రా,ఒడిశాలలోని పలు గ్రామాల నుంచి గిరిజనులు వైద్యసేవలకు వస్తుంటారు. అలాంటి పరిస్థితులో,్ల కారణం ఏదైనా... ఇద్దరు డాక్డర్లు ఆసుపత్రిలో లేకుండా వైద్యసేవలను మృగ్యం చేయడంపై గిరిజనులు మండిపడుతున్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను పైపైనే చూస్తూ పాడేరు ఆసుపత్రికి రిఫర్‌ చేయడం ఇక్కడ అలవాటుగా మారిందని, చిన్నపాటి రోగానికి కూడా సేవలు అందించడం లేదని ఆరోపిస్తున్నారు. అంతేకాక పేద గిరిజనులు వైద్యానికి వస్తే వారికి మందులు ఇవ్వకుండా, చీటిలు రాసి బయటకు పంపుతున్నారని వాపోతున్నారు. ఆసుపత్రి డెలివరీలను ప్రోత్సాహించడానికి ప్రభుత్వం ఆర్థికసాయం ఇస్తుంటే, ఇక్కడమాత్రం ప్రసవానికి వచ్చిన వారి నుంచి ముడుపులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.రౌండ్‌దిక్లాక్‌ సేవలు అందించాల్సిన పిహెచ్‌సిలో, ఉదయం వైద్యులిద్దరూ డుమ్మాకొడితే, సాయంత్రం పిహెచ్‌సి వద్దకు స్థానిక ప్రజాశక్తి ప్రతినిధిగా వెళ్లగా, అక్కడ కాపలా ఉన్న ఒక వృద్ధురాలు తప్ప వేరెవరు కనిపించలేదు.
ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
గిరిజన గ్రామాల్లో మెరుగైన వైద్యానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఒకవైపు ప్రకటిస్తుంటే, ఇక్కడి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పెదబయలు పిహెచ్‌సిలో వైద్యసేవలు మృగ్యంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించాలని, సేవలను ప్రక్షాళన చేసి, మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైతే విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.