Jun 14,2023 22:33

భద్రాచలం రాముడి గుడికి వెళ్లొస్తుండగా ఘోర ప్రమాదం
నలుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు
మృతుల్లో తోడళ్లులు, అన్నదమ్ములు
ప్రజాశక్తి - టి.నర్సాపురం

వారంతా బంధువులే. మూడు కుటుంబాలకు చెందిన 12 మంది భద్రాద్రి రాముడికి మొక్కులు చెల్లించుకోవడానికి బుధవారం తెల్లవారుజామున సంతోషంగా బయల్దేరి వెళ్లారు. దర్శనం అనంతరం టాటాఏస్‌లో తిరుగు ప్రయాణంలో చోటుచేసుకున్న ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి సుమారు 20 అడుగుల లోతు వాగులో పడిపోయింది. అప్పటివరకూ ఆనందంగా సాగిన ప్రయాణం కుదుపునకు లోనైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తోడల్లుళ్లు, చిన్నారులైన ఇద్దరు అన్నదమ్ములు విగతజీవులయ్యారు. మరికొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటన మండలంలోని తిరుమలదేవిపేట గ్రామంలో బుధవారం పెను విషాదాన్ని నింపింది.
తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన జట్ల దుర్గారావు తన భార్య నిర్మలకుమారి, ఇద్దరు కుమారులు, తోడల్లుడు పశ్చిపాల చిన్న శ్రీను, భార్య కమల కుమారి, ఇద్దరు పిల్లలు, బావమరిది దాసరి నరసింహరావు కుటుంబీకులు మొత్తం 12 మంది భద్రాద్రి రాముడి దర్శనానికి బయల్దేరారు. బావమరిది నరసింహారావుకు చెందిన టాటాఏస్‌ వాహనంపై వీరు ప్రయాణం సాగించి దర్శనం చేసుకున్నారు. తిరిగి అదే వాహనంపై బుధవారం మధ్యాహ్నం బయల్దేరారు. తెలంగాణా-ఆంధ్రా సరిహద్దులోని బూర్గంపాడు వద్ద కిన్నెరసాని వాగు వంతెనపై నుండి టాటా ఏస్‌ వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి వాగులో పడిపోయింది. దీంతో వ్యానులో ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న తెలంగాణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన వారిని బూర్గంపాడు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరు తోడల్లుళ్లు జట్ల దుర్గారావు (35), పశ్చిపాల చిన్న శ్రీను (34) అప్పటికే మృతి చెందగా దుర్గారావు కుమారులు సందీప్‌ (10), ప్రదీప్‌ (8) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చిన్నశ్రీను కుమార్తె రవిత్రేణి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించినట్లు సమాచారం. మిగిలిన వారు గాయాలతో భద్రాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బంధువులు తెలిపారు.
రెండు కుటుంబాల్లో తీరని విషాదం
తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన జట్ల దుర్గారావు దాసరి వెంకటసత్యనారాయణ, సుబ్బలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తెను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు. అదే గ్రామానికి చెందిన పశ్చిపాల చిన్న శ్రీను చిన్న కుమార్తె కమల కుమారిని వివాహం చేసుకోగా వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే తెలంగాణా రాష్ట్రం బూర్గంపాడువద్ద జరిగిన ప్రమాదంలో దుర్గారావు, అతని ఇద్దరు కుమారుడు మృతి చెందగా భార్య నిర్మల ప్రమాదం నుండి బయటపడి ఒంటరిగా మిగిలిపోయింది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కాని పరిస్థితి నెలకొంది. చిన్న శ్రీను మృతి చెందగా ఆయన కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇద్దరు అల్లుళ్లను, ఇద్దరు మనవళ్లను కోల్పోయిన మృతుల అత్త మామ రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.
తల్లడిల్లిన తిరుమలదేవిపేట
గ్రామానికి చెందిన నలుగురు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారని గుర్తు చేసుకుని అంతా ఆవేదన వ్యక్తం చేశారు.