Jul 24,2023 21:53

గుమ్మలక్ష్మీపురం : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి -కలెక్టరేట్‌ : తక్షణమే తమకు పాఠ్యపుస్తకాలివ్వాలని, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో గల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన ఇంటర్‌ విద్యార్థులు స్థానిక బెలగాం చర్చిసెంటర్లో సోమవారం 8గంటల నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి తోట రమేష్‌ ప్రారంభించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి, శ్రామిక మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి. ఇందిరా ఈ దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.రాజు, సిహెచ్‌.సింహాచలం అధ్యక్షతన జరిగిన ఈ దీక్షల్లో వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్‌ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయట్లేదని, కనీసం చదువుకోవడానికి పాఠ్య పుస్తకాలు ఇవ్వడం లేదని అన్నారు. బోధనకు అధ్యాపకల్లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. పుస్తకాలు ఇవ్వాలి, మధ్యాహ్నం భోజనం పెట్టాలని అడిగితే అమ్మఒడి ఇస్తున్నాం కదా అని విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పడం సరైంది కాదని, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పథకాలకు పాఠ్యపుస్తకాలు ముండిపెట్టడం సరైంది కాదన్నారు. పుస్తకాల్లేకుండా పాఠాలు ఎలా కొనసాగుతాయని, విద్యార్థులు ఎలా ఉత్తీర్ణులవుతారని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ సమస్యపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఇంటర్‌ బోర్డుని కలవడానికి వెళ్తే వారిని కనీసం కలిసే అవకాశం ఇవ్వకుండా నిర్ధాక్షణంగా రోడ్లపై అరెస్ట్‌ చేయడం సిగ్గుమాలిన చర్యని విమర్శించారు. సమస్యలు పరిష్కరించమని విద్యార్థులు, విద్యార్థి నాయకులు పోరాటాలు చేస్తుంటే అవేవో గొంతెమ్మ కోరిక్కెల్లా ప్రభుత్వం స్పందించకుండా ప్రశ్నించే నాయకుల్ని, విద్యార్థుల్ని బెదిరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలివ్వాలని, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, అదే సందర్భంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నిరసన దీక్షలో జూనియర్‌ కళాశాల నుంచి విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గుమ్మలక్ష్మీపురంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు కాలజీ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నానుద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు ఎ.గంగారావు మాట్లాడుతూ జూనియర్‌ కళాశాలల ప్రారంభించి నెల రోజులు దాటిన పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదన్నారు. షాపులు వద్ద పుస్తకాలు కొనాలంటే ఆర్థిక భారం అవుతుందన్నారు. విద్యార్థులు చదువుచున్న చోట కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాడు నేడు పనులు పూర్తి చేయలేదని, అన్ని సబ్జెక్టులకు అధ్యాపకుల్లేరని ఆందోళన వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో ఉంటున్న వందలాదిమంది విద్యార్థులకు మరుగుదొడ్లు, స్నానపు గదులు చాలడం లేదన్నారు. విద్యార్థులు ఆరు బయటకు వెళ్లి కాలకత్యాలు తీర్చుకుంటున్నారని అన్నారు. దీనివల్ల అనుకోని ప్రమాదాలు జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 400పైగా విద్యార్థులు ఉన్న వసతి గహాల్లో విద్యార్థులకు అనారోగ్యం వాటిల్లితే స్థానికంగా వైద్య సేవలు అందించేందుకు ఎఎన్‌ఎంను కూడా నియమించలేదన్నారు. పలుచోట్ల వార్డెన్లు ఎఎన్‌ఎంలను నియమించుకొని మందులు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎ.మహేష్‌, సభ్యులు సంతోష్‌, నవీన్‌ , రాము, విద్యార్థులు పాల్గొన్నారు.