ప్రజాశక్తి-కాకినాడ దేశవ్యాప్తంగా న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలని ఐలు రాష్ట్ర నాయకులు డి.రాజగోపాల్ డిమాండ్ చేశారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 6వ మహాసభ కాకినాడ బార్ అసోసియేషన్‌లో జిల్లా అధ్యక్షులు మేడపాటి ధర్మారెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే న్యాయవాదుల సంఘంలో ఐలు అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘం అని పేర్కొన్నారు. ఐలు న్యాయవాదుల సమస్యలతో పాటు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న ఏకైక సంఘం అన్నారు. మూడేళ్లలో ఐలు చేసిన కార్యక్రమాల నివేదికను భాస్కరాచార్యులు ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. అనంతరం జిల్లా, నగర కమిటీలను ఎన్నుకున్నారు.










