Nov 17,2023 20:59

కల్లాల్లో మట్టిస్తున్న ధాన్యాన్ని పరిశీలిస్తున్న సిఐటియు నాయకులు సాంబమూర్తి

ప్రజాశక్తి - కొమరాడ :   రైతులు పండించే ప్రతి ధాన్యం గింజను రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఎపి రైతు సంఘం నాయకులు ఎ.ఉపేంద్ర, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి కోరారు. రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని, దళారులకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన వివిధ రకాల పంటలకు, వరికి గిట్టుబాటు ధర కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అంతేకాక సరైన సమయంలో పంటలు కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. ప్రతి ధాన్యపు గింజను ప్రకటించిన మద్ధతు ధర ప్రకారం కొనుగోలు చేసి దళారుల నుండి రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడాది మాదిరిగా కాకుండా ఇప్పటికే మండలంలో ఈ ఏడాది 10,990 ఎకరాలకు ఇ-క్రాపు వ్యవసాయ శాఖ అధికారులు చేసినట్టు తెలిపారు. దీని ప్రకారం 17వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మండలంలో కొనుగోలు చేయాల్సి ఉందని, దీనికి అనుకూలంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలో ఇప్పటికే గ్రామాల్లో రైతులు కొంతవరకు సేకరించిన ధాన్యాన్ని 83 కేజీలు రూ.1260కు కొనుక్కొని పరిస్థితి ఉందని తెలిపారు. ఇంత జరుగుతుంటే సివిల్‌ సప్లై అధికారులు మాత్రం కార్యాలయానికే పరిమితమై ఉండే పరిస్థితి ఉందని, కావున రైతుల వద్ద ఉన్న ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. లేనిచో ఈ విషయంపై రైతులందరితో కలిసి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో గిరిజన, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు హెచ్‌.లక్ష్మం, ఆర్‌.శివున్నాయుడు పాల్గొన్నారు.