Jan 08,2023 23:17

మాట్లాడుతున్న అప్పలరాజు

ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని ఉద్దండపురంలో దళితులను కించపర్చుతూ, దాడి చేసి అవమానం పరిచిన గ్రామానికి చెందిన అగ్రవర్ణ పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. ఆదివారం బాధిత దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 5న ఇరు వర్గాలతో మాట్లాడడానికి ఎస్‌ఐ పిలిపించగా, ఆమె సమక్షంలోనే గ్రామానికి చెందిన అగ్రవర్ణ పెత్తందార్లు దాడి చేసి గాయపరచడం జరిగిందని, దాడి జరిగి నాలుగు రోజులు అవుతున్నా పోలీసులు కేసు నమోదు చేసి ఊరుకున్నారే తప్ప దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపలేదని తెలిపారు. దాడి చేసిన వారిని పోలీసులు రిమాండ్‌కు తరలించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు, హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై అనకాపల్లి జిల్లా ఎస్‌పి స్పందించి దోషులను కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. భయంగా ఉన్న దళితులకు రక్షణ కల్పించాలని, వారికి ఆర్ధికంగా సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎం.నానాజీ, పులి శ్రీను, పులి మారతమ్మ, పులి నూకరత్నం, బీదా లోవతల్లి, నీలా నాగమణి పాల్గొన్నారు.