Aug 10,2023 23:04

  • ఫిలిప్పీన్స్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులు

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్సిటీ: ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ (వైయస్సార్‌ యూనివర్శిటీ) ఎదుట ఫారన్‌ మెడికల్‌ గ్రాడ్యూయేట్స్‌ గురువారం ఉదయం రిజిష్ట్రార్‌ రమేష్‌ను కలసి విన్నవించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పలువురు విద్యార్థులు తరలివచ్చారు. రిజిష్ట్రార్‌ను కలసిన అనంతరం వైద్య విద్యార్థులు సీహెచ్‌ నితిన్‌, శ్రీకాంత్‌, జయకృష్ణ, శశికళ, తేజశ్వీ, నిషిత మీడియాతో మాట్లాడుతూ, తమ న్యాయమైన డిమాండ్లను వివిధ రూపాల్లో ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదన్నారు. తక్షణం తమకు ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌తోనే పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ ఇవ్వాలని, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ గైడ్‌లైన్స్‌ నిబంధనల మేరకు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం తక్షణం ముందుకు రావాలని డిమాండ్‌ చేశారు. గతంలో కోవిడ్‌ కారణంగా ఫిలిప్పీన్స్‌లో ఇంటర్న్‌షిప్‌ కుదరని నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాది కాలంపాటు ఎటువంటి స్టైఫండ్‌ లేకుండా కేవలం ఉచితంగా సేవలందించామని వైద్య విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ లేని కారణంగా ఉద్యోగాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు అనేకం చవిచూడాల్సి వస్తుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసి మూడు నెలలు గడుస్తున్నా మెడికల్‌ కౌన్సిల్‌తో పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనబడలేదన్నారు. తమ డిమాండ్లను విన్న అనంతరం రిజిష్ట్రార్‌ రమేష్‌ మాట్లాడుతూ సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమకు రెండు రోజులు గడువు ఇస్తే ప్రభుత్వం దష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని తమకు హామీ ఇచ్చినట్లు విద్యార్థులు వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ఫారన్‌ మెడికల్‌ గ్రాడ్యూయేట్స్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయికృష్ణ, రోహిత, ప్రితమ్‌, భరత్‌, తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.