ప్రజాశక్తి - భీమడోలు
రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను అమలు చేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో నాణ్యమైన ఎక్కువ దిగుబడులను సాధించవచ్చునని ఏలూరు ఏరువాక కేంద్రానికి చెందిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాత, శాస్త్రవేత్తలు డాక్టర్ ఫణి కుమార్, డాక్టర్ నాగేంద్ర తెలిపారు. భీమడోలులో మేలైన యాజమాన్య పద్ధతులతో నిర్వహిస్తున్న పొలంబడి వ్యవసాయ క్షేత్రాలను వారు బుధవారం పరిశీలించారు. రైతులతో మమేకమయ్యారు. అనంతరం వ్యవసాయ అధికారి ఎస్‌పివి ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న పొలంబడి కార్యక్రమంలో పరిసరాల పర్యావరణ విశ్లేషణ నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పొలంబడి వ్యవసాయ క్షేత్రాలలో ఆకు ముడత తెగులు ఎక్కువగా ఉన్నట్టు గమనించామన్నారు. దీని నివారణకు ఎకరం ఒక్కింటికి 8 కేజీల కార్బన్ హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని నీటితో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ వ్యవసాయ సహాయకులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.










