ప్రజాశక్తి - నిజాంపట్నం
వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన చేపలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని వైసీపీ నాయకులు మోపిదేవి హరనాథ్ బాబు అన్నారు. గ్రామంలో బొమ్మిడి వెంకటసుబ్బారావు ఏర్పాటు చేసిన మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చేపల అవుట్ లెట్లు పెట్టుకుని సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లు ఎంతగానో దోహద పడతాయని అన్నారు. దళారులు, మధ్య వర్తుల బారిన పడకుండా మత్స్యకారులు నుండి నేరుగా లబ్ధిదారులకు చేపల అమ్మకాలు చేసుకోవచ్చని అన్నారు. కొత్తగా రైతులు ఫిష్ ఆంధ్ర మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటు చేసుకుంటే ఒక యూనిట్ ఖరీదు రూ.3లక్షల 25వేలు అవుతుందన్నారు. ఈ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 40శాతం సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. ఫిష్ ఆంధ్రా దుకాణాల ద్వారా మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కొత్తగా మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లను తీసుకువచ్చిందని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నర్రా సుబ్బయ్య, మత్స్యశాఖ ఎడి సైదా నాయక్, ఎఫ్డిఓలు పి సాయి సందీప్, టి రఘు కిషోర్ రెడ్డి, బోటు యూనియన్ ప్రెసిడెంట్ మోపిదేవి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ మార్కండేయులు, నాజర్ ఖాన్, పంచాయితీ సెక్రటరీ పి అజయ్ కుమార్ పాల్గొన్నారు.










