Jul 18,2023 21:32

రైతు బజార్‌లో బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

రాయచోటి : ప్రభుత్వ ఆదేశాల మేరకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. మంగళవారం స్థానిక రైతు బజారులో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు అధికంగా ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు, సాధారణ ప్రజానీకానికి తక్కువ ధరకే బియ్యం అందజేసేలా ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. తక్కువ ధరకే బియ్యం అందజేయడానికి ముందుకు వచ్చిన రైస్‌ మిల్లర్లు, ట్రేడర్స్‌ను ఈ సందర్భంగా అభినందించారు. ఇందులో స్టీమ్‌ రకం బియ్యం రూ.46 కాగా, బిపిటి రకం బియ్యం రూ.48కు అందించనున్నట్లు చెప్పారు. బియ్యాన్ని బ్లాక్‌ చేసి, అధిక ధరలకు విక్రయిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కొనుగోలుదారులకు బియ్యం ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ వండాడి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి , రైస్‌ మిల్లర్స్‌ ప్రతినిధులు, ట్రేడర్స్‌, రైతులు పాల్గొన్నారు.