ప్రజాశక్తి-పాడేరు: అంగన్వాడీ కేంద్రాలలో బరువు తక్కువగా ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అంగన్వాడి సిడిపిఒలను, సూపర్వైజర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పిల్లలు బరువు పెరగక పోవటానికి కారణాలను విశ్లేషించి తదనుగుణంగా పోషకాహారాన్ని అందించాలని, అవసరమైతే డాక్టర్ల సహాయం తీసుకోవాలని సూచించారు. అటువంటి వారిని కొన్ని రోజులు పౌష్టికాహార పునరావాస కేంద్రంలో ఉంచి పౌష్టికాహారం అందించాలన్నారు. సూపర్వైజర్లు ప్రతి వారంలో కనీసం ఐదు రోజులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి ఆయా గ్రామాలలో కొంత సమయం వారితో గడపి. వారికి అవసరమైన సూచనలు అందించాలన్నారు. చిన్నారులకు తల్లి పాలు పట్టే విధానం, పొజిషన్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఆయా అంగన్వాడీ కేంద్రాలలో స్టాక్ పరిశీలన చేయాలని, ప్రతి రోజు వంట వండుతున్నదీ లేనిదీ పరిశీలించాలని ఆదేశించారు. సూపర్వైజర్లు గ్రామాలను సందర్శించే తేదీలు ముందుగానే షెడ్యూల్ వేసుకుని, దాని ప్రకారం పర్యటించాలని, అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సేవలపై ఆరా తీయాలని సూచించారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో కొన్ని రోజులు వంట చేయడం లేదని, ఇది తన దృష్టికి వచ్చినందున, కేంద్రాలకు ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి వంట చేస్తున్నారనేది పరిశీలించాలన్నారు. అంగన్వాడీలకు రాలేని బాలింతలు, గర్భిణీలకు టేక్ హౌమ్ రేషన్ అందించాలన్నారు. గత సమావేశంలో అంగన్వాడీ కేంద్రాల సందర్శన ఫోటోలను తీయాలన్న ఆదేశాల అమలును కలక్టర్ పరిశీలించారు. ఆయా కేంద్రాల సూపర్వైజర్లు తీసుకున్న ఫోటోలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ, తక్కువ బరువున్న పిల్లల బరువులను ఒక రిజిస్టర్ లో నమోదు చేయాలని, ఒక నెల రోజులు వ్యక్తిగతంగా పర్యవేక్షించి నెల తరువాత బరువును పరిశీలిస్తే ఖచ్చితంగా పెరుగుతుందని, పర్యవేక్షణ చేస్తూ, పౌష్టికాహారం తప్పనిసరిగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శిక్షణా కలక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్యలక్ష్మి, పాడేరు డివిజన్ సిడిపిఓలు, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.










