పేపర్ చదువుకుంటూ ఏం గుర్తొచ్చిందో ఏమో, 'నువ్వేదైనా చెప్పు కానీ, మన మోడీ గారు మాత్రం చాలా గొప్పవాడోరు!' భార్యామణి నుద్దేశించి అన్నాడు గౌరీశంకర్.
'అంత పరగడుపునే ఈసారి ఏం ఘనకార్యం చేసాడండీ' అని ఆమె అనడంతో, పాపం గౌరీశంకర్‌కి కోపమొచ్చేసింది. కొద్దిగా గట్టిగానే, 'వెటకారాలు ఆపి, ఆయన గొప్పతనం గురించి కొద్దిగానైనా తెలుసుకో. బాగుపడతావ్. చెబుతా విను' అని ప్రారంభించాడు.
'మన ఇంట్లో వాళ్లనే చనిపోయిన కొన్నాళ్లకి మర్చిపోతాం కదా! అలాంటిది మోడీ గారు చూడు. ఎప్పుడో చనిపోయిన గాంధీ గారిని ఇంకా నిత్యం తలుచుకుంటూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న ఆయన జయంతి సందర్భంగానైతే గాంధీ గారి విలువలు, విధానాలు ఎంతో స్ఫూర్తిదాయకమని దేశ ప్రజలందరికీ చెప్పారు తెలుసా? గ్రామసీమల రూపు రేఖలు మార్చేయడానికి జల్ జీవన్ మిషన్ అనే కొత్త మొబైల్ యాప్ కూడా ప్రారంభించాడు. గాంధీ గారి పట్ల ఎంతో అభిమానముంటేనే కానీ అలా మాట్లాడలేరు కదా! ఏమంటావ్?'
'మాటలు బానే ఉన్నాయి కాని, కేవలం యాప్ ఏం చేస్తుందండీ. సెల్ కొనుక్కోవడానికి జనం దగ్గర డబ్బే లేకపోయే. నేను కూడా కొన్ని అడుగుతాను. వాటికి మీరు సమాధానం చెప్పండ'ని ఆమె అనడంతో, సరే చెప్పు అన్నాడు.
'గాంధీ గారు ఏం చెప్పారండీ? గ్రామ స్వరాజ్యం అన్నారా లేదా? దీనర్థమేంటి? గ్రామ ప్రజలకు అంటే రైతులకు స్వతంత్రత ఇవ్వాలని. మరి మీ మోడీ గారేం చేస్తున్నారు? రైతుల చేతులకు బేడీలు వేసి, ఉన్న స్వేచ్ఛ కూడా పోయేలా చట్టాలు చేశారు కదా! వాటిని రద్దు చేయాలనే కదా! రైతులు అంత పోరాటం చేస్తున్నారు. నిజంగా గాంధీ గారి విధానమైతే మోడీ గారేం చేయాలి? చట్టాలు చేసేటప్పుడు వీటి ప్రమాదం తెలీదేమోనని సరిపెట్టుకోవచ్చు. కానీ, దేశ ప్రజలంతా ఒద్దంటున్నా వాటిని రద్దు చేయకుండా ఎందుకు భీష్మించుకు కూర్చున్నాడండీ. గ్రామాలను గుండుగుత్తగా కార్పొరేట్లకు అప్పచెప్పడానికి తప్ప. గాంధీ విధానాలేమో పరమత సహనం, అహింస. మరి మోడీ గారేమో వీటికి పూర్తి భిన్నం. విద్వేషం, హింస ఈయన పద్ధతి. వీరిద్దరికీ అస్సలు పొసగదు కదా! ఇద్దరి విధానాలకీ ఎక్కడండీ పోలిక ఆ మహాత్ముడి కాలి గోటికి కూడా ఈయన సరిపోడు. మరి గాంధీ గారి ఫొటో ఎందుకు పెట్టుకు తిరుగుతున్నాడీయన?'
దానితో సిర్రెత్తుకొచ్చిన గౌరీశంకర్ 'మోడీ ఏమీ అలా తిరగడం లేదు. కావాలంటే ప్రకటనలు చూడు. పట్టి పట్టి చుస్తే కానీ కనపడని గాంధీ, చత్వారం వారికి కూడా కనపడేలా మోడీ ఫొటోలు ప్రభుత్వ ప్రకటనల్లో ఉన్నాయి చూడు.'
'ఆహా! భలేగా చెప్పారండీ. అవును నిజమే కదా! పేపర్ల నిండా ఎక్కడ చూసినా మోడీ ఫొటోలే. దీనికి తోడు ఆ గెడ్డమొకటి. అయినా ఎవరి పుట్టిన రోజున వాళ్ళ ఫొటోలుండాలి కానీ, మధ్యలో ఈ పిట్టల దొర ఫొటోలెందుకండీ? దాన్ని బట్టే తెలుస్తోంది కదా! ఈయన గారికి ప్రేమ గాంధీగారిపై కాదు. ఆయనకున్న ప్రతిష్టను వాడుకోవడానికే అని. ఈయనో పబ్లిసిటీ మాస్టర్ అనీ'.
'అలా అంటావు కానీ, మోడీ గారు చూడు. గాంధీ గారిని ఏకంగా స్వచ్ఛ భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గానే చేసేసారు. గత ప్రభుత్వాలేవీ చేయని పని కదా ఇది. దీనికేమంటావు మరి?'
'ఇన్నాళ్లూ మీరేదో తెలివైన వారనుకున్నాను కానీ, ఇంత సులువుగా బుట్టలో పడిపోతారనుకోలేదండోరు! గాంధీ గారేమైనా సెలబ్రటీ అటండీ ప్రచారకుడిగా ఉంచడానికి. ఆయన ప్రపంచమే గర్వించదగ్గ మహానుభావుడు. ఆయన స్థాయిని ఇలా దిగజార్చడం నిజంగా మోడీ గారికే చెల్లింది సుమా! ఆయన పేరును వాడుకుంటూ, సామ్రాజ్యవాదానికి ఈయన దాసోహమవడం మీకు కనపడలేదా? ఈయన నోరిప్పితే అబద్ధమే. విప్పకపోయినా అనర్ధమే. ఏదైనా ప్రజలకు సంకటమే.
ఇంకో విషయమండోరు! గాంధీ గారిని చంపిన గాడ్సే వారసుడీయన. చేసిన పాపం అంత సులువుగా పోతుందా? ప్రజలూ అంత వేగంగా మరిచిపోరనీ వీరికీ తెలుసు. అందుకే కదా! ఆయన పేరు చెప్పుకుని, చల్లగా తమ సొంత ఎజెండా జనంపై రుద్దుతున్నారు....'
ఇదేదో రివర్స్ గేరులా ఉందే అన్న అనుమానంతో 'అయితే ఇప్పుడేమంటావ్? మోడీ మోసకారనా నువ్వు చెప్పదల్చుకున్నది' అన్నాడు గౌరీశంకర్ కొంచెం అసహనంగా.
'అబ్బో! ఎంత కరెక్టుగా చెప్పారండీ. అందుకే మీరు చాలా గొప్పవారండి. ఏమైనా టక్కు టమార విద్యలలో ఆ మోడీని మించిన వారు లేరండి. మీరు మాత్రం ఆయనను వదిలేయండి. లేకపోతే, మీరూ ఆ ఖాతా లోకే పోతారు' అనడంతో పాపం గౌరీశంకర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
'నాకెందుకులే ఆ శాపం...' అనుకుంటూ ఇక మారు మాట్లాడకుండా అక్కడనుండి చల్లగా జారుకున్నాడు.
సీతారాం










