Sep 20,2021 07:25

స్కూళ్లు తెరుచుకున్నాయి. ఇప్పుడు బయట కొనుక్కుని తినడం పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. పిల్లలకిి స్వీట్స్‌ అంటే మహా ఇష్టం. ఎప్పడూ తినేవి కాకుండా వెరైటీగా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. ఇంకెందుకాలస్యం స్వీట్స్‌లో ఈ వెరైటీలను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

ఖర్బూజ బర్ఫీ

తియ్యతియ్యగా..

కావాల్సిన పదార్థాలు: ఖర్బూజ గింజలు - కప్పు, పంచదార - కప్పు, నెయ్యి - పావుకప్పు, నీళ్లు- అరకప్పు.
తయారుచేసే విధానం:
ముందుగా ఖర్బూజ గింజలను మిక్సీలో వేసి, పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్‌పై పాత్ర పెట్టి నీళ్లు, పంచదార వేసి చిన్నమంటపై మరిగించాలి.
పంచదార పానకం చిక్కబడిన తరువాత ఖర్బూజ గింజల పొడి చల్లాలి.
పొడి చల్లుతున్న సమయంలో ఉండలు కట్టకుండా ఉండటం కోసం కలియబెడుతూ ఉండాలి. కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ఉండాలి.
మిశ్రమం బాగా చిక్కబడిన తరువాత నెయ్యి రాసిన ప్లేట్‌లోకి మార్చుకోవాలి. తరువాత నచ్చిన ఆకారాల్లో కట్‌ చేసుకోవాలి. అంతే తియ్యని ఖర్బూజ బర్ఫీ రెడీ.

నువ్వుల బర్ఫీ

నువ్వుల బర్ఫీ
కావాల్సిన పదార్థాలు: నువ్వులు - 300 గ్రాములు, బెల్లం - 250 గ్రాములు, నెయ్యి - 50 గ్రాములు, యాలకులు - పది, బాదం పలుకులు - పది.
తయారుచేసే విధానం:
యాలకులను పొడి చేసుకోవాలి. బర్ఫీ ట్రేకి నూనె లేదా నెయ్యి రాసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నువ్వులను వేగించాలి. రెండు మూడు నిమిషాల పాటు వేగించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగించకూడదు.
తరువాత ఆ నువ్వులను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి, కొద్దిగా వేడి అయ్యాక నెయ్యి వేయాలి. అది కరిగిన తరువాత బెల్లం వేయాలి.
పావుకప్పు నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు చిన్నమంటపై ఉంచాలి. మధ్యమధ్యలో కలియబెడుతూ ఉండాలి.
ఇప్పుడు నువ్వుల పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. మిశ్రమం కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉంచి దింపాలి. నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలో మిశ్రమాన్ని పోయాలి. బాదం పలుకులతో గార్నిష్‌ చేసుకోవాలి.
స్పూన్‌తో బాదం పలుకులను కాస్త ఒత్తితే బర్ఫీకి అంటుకుంటాయి. పావుగంట తరువాత బర్ఫీని నచ్చిన సైజులో కట్‌ చేసుకోవాలి. అంతే రుచికరమైన నువ్వుల బర్ఫీలు రెడీ.


రస్‌ మలాయి

రస్‌ మలాయి
కావాల్సిన పదార్థాలు:
పనీర్‌ కోసం: పాలు - లీటరు, నిమ్మరసం - రెండు స్పూన్లు, నీళ్లు- కప్పు.
పంచదార పానకం కోసం: పంచదార - ఒకటిన్నర కప్పు, నీళ్లు - ఎనిమిది కప్పులు.
రబ్డీ కోసం: పాలు - లీటరు, పంచదార - పావు కప్పు, యాలకుల పొడి - అర స్పూన్‌, కుంకుమ పువ్వు పాలు - రెండు స్పూన్లు, పిస్తాలు - ఏడు, బాదం - ఐదు పలుకులు, జీడిపప్పు- పది పలుకులు.
తయారుచేసే విధానం:
పాత్రలో పాలు పోసి, మరిగిన తరువాత నిమ్మరసం పోసి కలపాలి.
మరుగుతూ ఉన్నప్పుడు కలుపుతూనే ఉండాలి. చివరగా అదనంగా మిగిలిన నీటిని తీసేయాలి.
అరగంట తరువాత గట్టిపడిన పనీర్‌ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న బాల్స్‌ చేసి పక్కన పెట్టుకోవాలి.
నీళ్లు, పంచదార మరిగించుకుని, పంచదార పానకం తయారు చేసుకోవాలి. తరువాత అందులో పనీర్‌ బాల్స్‌ వేయాలి.
రబ్డీ తయారీ కోసం పాత్రలో పాలను మరిగించాలి.
పాలు మరుగుతున్న సమయంలో పైన తేరుకునే మీగడను స్పూన్‌తో మరొక పాత్రలోకి తీసుకోవాలి. మళ్లీ పాలు మరిగించాలి. ఇలా ఐదు సార్లు మీగడ తీయాలి.
తరువాత మిగిలిన పాలలో పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు పాలు పోసి మరికాసేపు మరిగించాలి.
ఈ రబ్డీ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో రెండు, మూడు గంటల పాటు పెట్టాలి. తరువాత పనీర్‌ బాల్స్‌పై రబ్డీ మిశ్రమాన్ని పోసి, నట్స్‌తో అలంకరించాలి.
అంతే చల్లని రస్‌మలాయిని ఇంటిల్లిపాది ఇష్టంగా తినవచ్చు.


ఆపిల్‌ హల్వా

ఆపిల్‌ హల్వా
కావాల్సిన పదార్థాలు: ఆపిల్స్‌- నాలుగు, నెయ్యి- నాలుగు స్పూన్లు, జీడిపప్పు పలుకులు- 8, చక్కెర- పావుకప్పు, కేసరి రంగు, యాలకుల పొడి- పావుస్పూను, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌- స్పూను.
తయారుచేసే విధానం:
ఆపిల్‌ను తురుముకోవాలి. ఓ పాన్‌లో నెయ్యి వేసి, జీడి పలుకులను వేయించి పక్కన పెట్టాలి.
మిగతా నెయ్యిలో ఆపిల్‌ తురుమును వేసి మెత్తగా అయ్యేవరకూ వేయించాలి.
ఆ తరువాత చక్కెర, కేసరి రంగు వేసి, బాగా కలపాలి. చక్కెరంతా కరిగి, హల్వా అంతా దగ్గరయ్యాక వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, యాలకుల పొడి, జీడిపుప్పు పలుకులు కలిపితే ఆపిల్‌ హల్వా రెడీ.