Feb 14,2021 13:30

                                                                    షోర్‌ భాజా

షోర్‌ భాజా


కావాల్సిన పదార్థాలు :
పాలు - లీటరు, పంచదార - పావుకేజీ,
నెయ్యి - తగినంత, పిస్తా - తగినంత.
 

తయారుచేసే విధానం :

స్టవ్‌పై పాన్‌పెట్టి కొద్దిగా నీళ్లు పోయాలి. అందులో పంచదార వేసి పాకం వచ్చే వరకూ ఉంచాలి.
మరొక పాత్రలో పాలు తీసుకుని మరిగించాలి. అపుడు పాల మీద మీగడ వస్తుంది. మీగడ తయారవుతున్న కొద్దీ స్పూన్‌తో ప్లేట్‌లోకి తీసుకుంటూ ఉండాలి.
అలా సేకరించిన మీగడను వెడల్పాటి ప్లేట్‌లోకి తీసుకుని, చతురస్రాకార ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
స్టవ్‌పై పాన్‌పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత కట్‌ చేసి పెట్టుకున్న మీగడ ముక్కలను వేసి వేగించాలి.
ఆ స్వీట్‌ ముక్కలను పంచదార పాకంలో వేయాలి. పావుగంట తరువాత పాకంలో నుంచి తీసి పిస్తాతో గార్నిష్‌ చేసి అందించాలి.


                                                                   పైనాపిల్‌ కేక్‌

 పైనాపిల్‌ కేక్‌


కావాల్సిన పదార్థాలు :
వెనీలా స్ఫాంజ్‌కేక్‌- ఒకటి, పంచదార నీళ్లు- అరకప్పు, పైనాపిల్‌ ఎసెన్స్‌- ఆరు చుక్కలు, పైనాపిల్‌ ముక్కలు- నాలుగు, కేక్‌ క్రీం- నాలుగు టీ స్పూన్లు, చెర్రీస్‌- సరిపడా.


తయారుచేసే విధానం :
స్ఫాంజ్‌ కేక్‌ తీసుకుని కింది, పై భాగాలను కట్‌ చేసుకోవాలి. తర్వాత కేకుని మూడు పొరలుగా కట్‌ చేసుకోవాలి.
పంచదార నీళ్లలో పైనాపిల్‌ ఎసెన్స్‌ కలుపుకోవాలి. ఒక్కో పొరపై మూడు టీ స్పూన్ల మిశ్రమాన్ని వేయాలి. తరువాత క్రీం రాయాలి.
వీటిని ఒకదానిపై ఒకటి పెట్టుకుని శ్యాండ్‌విచ్‌లా చేసుకోవాలి. ఈ కేకుని మనకి నచ్చిన ఆకారంలో కట్‌ చేసుకుని చెర్రీలు, పైనాపిల్‌ ముక్కలతో అలంకరించి ఓ పావుగంట ఫ్రిజ్‌లో పెట్టి తినాలి.

                                                                   స్ట్రాబెర్రీ మౌసీ

 స్ట్రాబెర్రీ మౌసీ



కావాల్సిన పదార్థాలు :
స్ట్రాబెర్రీ ప్యూరీ - కప్పు (స్ట్రాబెర్రీ గుజ్జు), హెవీ క్రీమ్‌ - కప్పు, వెనీలా ఎసెన్స్‌ - టీస్పూన్‌, పంచదార పొడి - మూడు టీస్పూన్లు, స్ట్రాబెరీలు - ఐదు (గార్నిష్‌ కోసం)

తయారుచేసే విధానం :
ముందుగా పెద్ద బౌల్‌ తీసుకుని, ఇందులో హెవీ క్రీమ్‌ వేసుకోవాలి. ఎలక్ట్రికల్‌ బీటర్‌తో మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్రీమ్‌ మొత్తం ఫోమ్‌లా అవుతుంది.
అందులోనే వెనీల ఎసెన్స్‌, పంచదార పొడిని కలుపుకోవాలి. మరోసారి పూర్తిగా అన్నీ కలిసేలా నిమిషం పాటు ఎలక్ట్రికల్‌ బీటర్‌తో కలుపుకోవాలి.
తర్వాత సిద్ధంగా ఉంచిన క్రీమ్‌లో స్ట్రాబెర్రీ ప్యూరీని వేసి గరిటెతోగానీ, విష్కరత్‌తోగానీ పదార్థాలు అన్నీ కలిసేలా కలియతిప్పాలి.
ఒకవేళ మన దగ్గర స్ట్రాబెర్రీ ప్యూరీ లేకపోతే స్ట్రాబెర్రీలను మిక్సీపట్టి వడకట్టగా వచ్చిన మిశ్రమాన్ని ప్యూరీగా వాడుకోవచ్చు.
తర్వాత తయారుచేసుకున్న మిశ్రమాన్ని గాజు గిన్నెలోకి తీసుకుని స్ట్రాబెర్రీ ముక్కలను కలుపుకోవాలి. దీన్ని గంటపాటు డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచుకోవాలి. రిఫ్రిజిరేట్‌ చేసిన మౌసీని తీసి కొద్దిగా బౌల్‌లో వేసుకుని మిగిలిన స్ట్రాబెర్రీ ముక్కలతో గార్నిష్‌ చేసుకోవాలి.
అంతే చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండే చల్లచల్లని పసందైన స్ట్రాబెర్రీ మౌసీని ప్రియమైన వారికి అందించవచ్చు.

                                                                   

                                                                 

                                                                 లౌకీ హల్వా

  లౌకీ హల్వా


కావాల్సిన పదార్థాలు :
సొరకాయ - చిన్నది, బాదం - నాలుగైదు పలుకులు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, నెయ్యి - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, కోవా - 50 గ్రాములు, పంచదార - మూడు టేబుల్‌స్పూన్లు, క్రీమ్‌ పాలు - 100 మిల్లీలీటర్లు, కుంకుమ పువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - టీస్పూన్‌, ఫుడ్‌ కలర్‌ - చిటికెడు, నట్స్‌ - గార్నిష్‌ కోసం కొద్దిగా.

తయారుచేసే విధానం :
ముందుగా సొరకాయ పొట్టు తీసేసి గుజ్జుగా చేసుకోవాలి. విత్తనాలు ఉంటే తీసివేయాలి.
పాన్‌లో నెయ్యి వేసి, కాస్త వేడి అయ్యాక సొరకాయ గుజ్జు వేసి చిన్నమంటపై వేగనివ్వాలి. కాసేపు వేగిన తరువాత బాదం పలుకులు, జీడిపప్పు వేయాలి. తర్వాత కోవా వేసి కలపాలి.
అందులోనే పంచదార, ఉప్పు వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు పాలు పోసి కలియబెట్టాలి. ఇందులో కుంకుమ పువ్వు వేయాలి.
మిశ్రమం చిక్కగా అవుతున్న సమయంలో కావాలనుకుంటే ఫుడ్‌ కలర్‌ వేసుకోవచ్చు. చివరగా యాలకుల పొడి వేసి, మరికాసేపు ఉంచి దింపుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసి, వేడి వేడిగా తినొచ్చు.