Mar 27,2023 22:55

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: టిటిడి తరహాలో లడ్డూ ప్రసాదాన్ని క్వాలిటీ, క్వాంటిటీ పెంచేలా తగు చర్యలు తీసుకోనున్నట్లు దుర్గగుడి చైర్మన్‌ కర్నాటి రాంబాబు తెలిపారు. మహామండపం ఆరవ అంతస్తులో సోమవారం దుర్గగుడి పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్‌ కర్నాటి రాంబాబు మాట్లాడుతూ నూతనంగా వివాహాలు చేసుకుని దుర్గమ్మ దర్శనానికి కొంగుముడితో వచ్చే వధూవరులకు అంతరాలయ దర్శనం చేయించి, ఆశీర్వచనం ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఉత్సవమూర్తులకు బంగారు మకరతోరణం పెట్టబోతున్నామని, హారతికి వచ్చే యాత్రికులకు ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సెక్యురిటీ నిమిత్తం మెటల్‌ డిటెక్టర్‌తో యాత్రికులను స్కాన్‌ చేసి వచ్చేలా ఏర్పాటు చేస్తామని, ఘాట్‌ రోడ్‌లో గాని ఇతర ప్రాంతాల్లో టాయిలెట్స్‌ను వెస్ట్రన్‌ పద్దతిలో ఏర్పాటు చేస్తామన్నారు. దుర్గాఘాట్‌లో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు రూమ్‌, క్లోక్‌ రూమ్‌ల కోసం టెండర్స్‌ పిలిచామని తెలిపారు. కేశఖండనశాలలో పర్యవేక్షణ ఉండేలా ఏఈవో స్దాయి అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమిస్తామని, పాలకమండలి నుండి ఒకరు, సూపరిండెంట్‌ స్దాయిలో ఒకరు, సీసీ కెమరాల పర్యవేక్షుడితో త్రిమెన్‌ కమిటీ వేయబోతున్నట్లు వివరించారు. లిఫ్ట్‌ దగ్గర, కేశఖండన శాల, ఈవో చాంబర్‌ దగ్గర భక్తుల సలహాలు, సూచనల కోసం సజేషన్‌ బాక్సులను ఏర్పాటు చేస్తామన్నారు. వాటిని నెలకొకసారి వాటిని పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు డ్రెస్‌ కోడ్‌ తప్పకుండా పాటించాలని, వారికి రెండు జతలు డ్రెస్‌లు దేవస్థానం నుండే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో దుర్గగుడి ఇఓ దర్భముళ్ల భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.