Dec 19,2021 06:58

వర్క్‌ కాంట్రాక్టు అయినా, లేబర్‌ కాంట్రాక్టయినా ప్రిన్సిపల్‌ ఎంప్లాయర్‌ టిటిడి యాజమాన్యమే అవుతుంది. ఈ రెండు రకాల కాంట్రాక్టు కార్మికులు కూడా చట్టం కింద సమానులే. వీరి మధ్య అసమానతలు లేవు. కాంట్రాక్టు వర్కర్ల చట్టం మరియు కొత్త కోడ్‌ కూడా దీనినే స్పష్టం చేస్తున్నాయి. టిటిడి యాజమాన్యం, పైస్థాయి అధికారులు కింది స్థాయిలో పని చేసే పేద కార్మికుల సమస్యలను సానుభూతితో పరిశీలించి పరిష్కరించాలి.

     టీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో పని చేసే కాంట్రాక్టు కార్మికులు తమకు న్యాయంగా రావాల్సిన వేతనాల కోసం దశల వారీగా పోరాడుతున్నారు. సొసైటీల కాంట్రాక్టు కింద పని చేసే కార్మికులు 7 వేల మంది 3 రోజుల పాటు సమ్మె చేస్తే యాజమాన్యం వారం రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పింది. గెస్ట్‌హౌసుల్లో వర్క్‌ కాంట్రాక్టు కింద పని చేసే కార్మికులు 3 వేల మంది 17 రోజుల పాటు సమ్మె చేశారు. వీరి సమస్యల పరిష్కారానికి ఇద్దరు జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, అదనపు ఫైనాన్స్‌ అడ్వయిజరీ కమిటీ అధికారి, చీఫ్‌ ఇంజినీర్లతో కలిపి ఒక కమిటీ వేశారు. మరో 200 మంది ఫారెస్టు కాంట్రాక్టు కార్మికులు 389 రోజుల నుండి రిలే నిరాహార దీక్షల్లో ఉన్నారు. వీరంతా తమకు టైమ్‌స్కేల్‌ అమలు చేయాల్సిందిగా కోరుతున్నారు.
     ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టిటిడి లో పర్మినెంట్‌ ఉద్యోగులకు - రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లు, బెనిఫిట్లు, హక్కులు అమలవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పైమూడు రకాల కాంట్రాక్టు కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సంబంధిత పర్మినెంట్‌ ఉద్యోగుల పేస్కేల్‌ లోని కనీస బేసిక్‌ అమలు చేయడం న్యాయం. పర్మినెంట్‌ కార్మికులు చేసే పనినే వీరూ చేస్తున్నారు. పర్మినెంట్‌ కార్మికుల ఖాళీల్లోనే అత్యధిక కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అందుకని వీరికి టైమ్‌ స్కేల్‌ అమలు చేసి కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయడం టిటిడి యాజమాన్య కనీస ధర్మం. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వాగ్దానాలే కాకుండా, సుప్రీంకోర్టు తీర్పు కూడా వీరి కోర్కెల్లోని న్యాయబద్ధతను తెలియజేస్తున్నది. టిటిడి ఉన్నతాధికారులు పునరాలోచించి టైమ్‌స్కేల్‌ అమలుకు పూనుకోవాలి.
మరో పక్కన కాంట్రాక్టు కార్మికుల (క్రమబద్దీకరణ, నిషేధం) చట్టం, 1970 తాలూకా రూల్‌ 25(2) (V) మరియు రాష్ట్ర ప్రభుత్వ కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన జీఓ నెం.11 లోని 12 (ఙఱఱ) ప్రకారం సంస్థ యజమాని నేరుగా నియమించుకున్న ఉద్యోగి చేస్తున్న పనినే కాంట్రాక్టు వర్కర్‌ చేస్తుంటే, ఆ కాంట్రాక్టు కార్మికునికి యజమాని నేరుగా నియమించిన ఉద్యోగి వేతనాలు, డిఏ, అలవెన్సులు, బెనిఫిట్లు, సెలవులు, ఇతర సౌకర్యాలు అన్నీ అమలు చేయాలి.
       కాంట్రాక్టు కార్మికులకు చట్ట ప్రకారం రాష్ట్రంలో వచ్చే జనవరి నెల నాటికి రెండు సార్లు 2017 లోనూ, 2022 జనవరి లోనూ వేతనాలు పెంచాలి. ఈ రెండు దఫాలు కనీసం 20 శాతం చొప్పున వేతనాలు పెంచి ఉంటే 2022 జనవరి నాటికి రూ.15,500 బేసిక్‌ వేతనం అవుతుంది. దీనిపైన విడిఏ కొనసాగుతుంది. దీనిని కూడా టిటిడి యాజమాన్యం పరిగణన లోకి తీసుకోవాలి.
      వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పారిశుధ్య కార్మికుల సమస్యలపై సానుభూతి చూపించారు. తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ఎవరూ చేయలేని పని పారిశుధ్య కార్మికులు చేస్తున్నారు కాబట్టి వారికి నెలకు కనీసం రూ.18 వేలు ఇవ్వడం న్యాయమని చెప్పారు. మున్సిపల్‌, పంచాయితీ, ఆసుపత్రుల్లో పని చేసే కార్మికులను దీనికి ఉదాహరణగా చెప్పారు. ముఖ్యమంత్రి సానుకూలతకు అనుగుణంగా జీఓ 151 ప్రకారం మున్సిపల్‌ కార్మికులకు పట్టణాలు/నగరాల్లో వచ్చే రూ.12 వేలకు అదనంగా ఆరోగ్య అలవెన్సు రూపంలో మరో రూ.6 వేలు కలిపి మొత్తం రూ.18 వేలు చెల్లిస్తున్నారు. టిటిడి లో పనిచేసే కారట్రాక్టు కార్మికులందరూ ఇదే పని చేస్తున్నారు. వారు కోరుతున్న టైమ్‌ స్కేల్‌ న్యాయబద్ధమైందని దీన్నిబట్టి తెలుస్తుంది. అధికారులు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించాలి.
     సుప్రీంకోర్టు తీర్పుతో పాటు కాంట్రాక్టు వర్కర్ల చట్టాన్ని కలిపి చూసినప్పుడు కాంట్రాక్టు కార్మికులకు కనీస బేసిక్‌ను, దాని మీద డిఏ, అలవెన్సులు ఇస్తే న్యాయం జరుగుతుంది. క్షౌర వృత్తిలో తల వెంట్రుకలు తీసే పీస్‌ రేటు వర్కర్లకు కూడా సుప్రీం కోర్టు తీర్పు వర్తిస్తుంది. వీరు పని చేసే చోట కూడా పర్మినెంట్‌ వర్కర్లు పని చేస్తున్నారు. పర్మినెంట్‌ ఖాళీల్లో వీరు పని చేస్తున్నారు. తల వెంట్రుకలు తీసే 1140 మంది పీస్‌ రేటు కార్మికులకు కూడా సుప్రీంకోర్టు తీర్పు అమలు చేస్తేనే న్యాయం జరుగుతుంది. వీరికి అసిస్టెంట్‌ కనీస బేసిక్‌ వర్తిస్తుంది.
       ఆందోళనలు, పోరాటాలు ఎప్పుడు కూడా కొంత మంది నాయకులు ఎగదోసినంత మాత్రాన జరగవు. అన్నేసి రోజులపాటు సమ్మె చేయడమంటే కార్మికులు తలచుకోకుండా జరగదు. కార్మికుల కోర్కెల్లోని న్యాయబద్ధతను పరిశీలించకుండా యూనియన్‌ నాయకులపై నిందలు వేయడం తగదు. అసంఘటిత రంగంలోని యూనియన్లకు సగం మంది, సంఘటిత యూనియన్లలో మూడో వంతు మంది బయటివారు ఆఫీసు బేరర్లుగా ఉండవచ్చని ట్రేడ్‌ యూనియన్‌ చట్టంలోనూ, ఉనికి లోకి రాబోతున్న పారిశ్రామిక సంబంధాల కోడ్‌ లోనూ స్పష్టంగా ఉంది. యూనియన్‌లో ఆఫీసు బేరర్లగా ఉన్న వారిని కూడా బయటివారనే పేరుతో చర్చలకు అంగీకరించకపోవడం న్యాయ సమ్మతం కాదు. ఈ వైఖరి సామరస్యపూర్వక వాతావరణానికి తోడ్పడదు.
       టిటిడి కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేస్తున్న సందర్భంగా పర్మినెంట్‌ ఉద్యోగుల నాయకులు వారికి మద్దతుగా పాల్గొన్నారనే కారణంతో ఇద్దరు నాయకులకు అధికారులు షోకాజ్‌ నోటీసులిచ్చారు. ఇచ్చిన గడువు లోపల వాటికి జవాబు ఇవ్వక ముందే వారిద్దరితో పాటు మరో నాయకుని కలిపి ముగ్గుర్ని సర్వీసు నుండి సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్లు కూడా సమ్మెలు చేయడం, ప్రభుత్వ శాఖల్లో పని చేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం గతం నుండి వస్తున్న ఆచారం. ఇటీవల జరిగిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జెఎసి లు కూడా ఆందోళనలు చేయడం, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోర్కెలను లేవనెత్తడం గమనించవచ్చు. అందుకని టిటిడి అధికారులు వాస్తవ దృష్టితో ఆలోచించడం మంచిది. వారి సస్పెన్షన్లను ఎత్తివేయడమే కాకుండా ఇటువంటి అంశాల్లో తొందరపడకుండా సానుకూలతతో వ్యవహరించాలి.
      కాంట్రాక్టు కార్మికులకు టైమ్‌స్కేల్‌ ఇస్తామని ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు. అయితే 'ముఖ్యమంత్రి చెబితే టైమ్‌స్కేల్‌ అమలు చేయకుండా ఎలా ఉంటాం? ముఖ్యమంత్రితో చెప్పించండి. అమలు చేస్తాం' అంటున్నారు అధికారులు. జిల్లా మంత్రి పూర్తి అవగాహనతో టిటిడి లో ఉన్న అందరికీ టైమ్‌స్కేల్‌ అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రి వాగ్దానం చేసిన తర్వాత అధికారులకు ఆదేశాలు వెళ్ళకుండా ఎలా ఉంటాయి? ఈ చిక్కు ముడిని విప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, టిటిడి యాజమాన్యం పైన ఉంది.
      వర్క్‌ కాంట్రాక్టు అయినా, లేబర్‌ కాంట్రాక్టయినా ప్రిన్సిపల్‌ ఎంప్లాయర్‌ టిటిడి యాజమాన్యమే అవుతుంది. ఈ రెండు రకాల కాంట్రాక్టు కార్మికులు కూడా చట్టం కింద సమానులే. వీరి మధ్య అసమానతలు లేవు. కాంట్రాక్టు వర్కర్ల చట్టం మరియు కొత్త కోడ్‌ కూడా దీనినే స్పష్టం చేస్తున్నాయి. టిటిడి యాజమాన్యం, పైస్థాయి అధికారులు కింది స్థాయిలో పని చేసే పేద కార్మికుల సమస్యలను సానుభూతితో పరిశీలించి పరిష్కరించాలి. మరో ఆందోళనకు తావు ఇవ్వకుండా చూడాలి.

/వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు /
పి.అజయ కుమార్‌

పి.అజయ కుమార్‌