టిటిడి హైలెవల్ కమిటీలో కీలక నిర్ణయం
కాలినడక భక్తులకు చేతికర్ర
దివ్యదర్శనం టోకెన్లు ఇక తిరుపతిలోనే : ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి
ప్రజాశక్తి- తిరుమల: టిటిడీ కొత్త చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలా బాధ్యతలు చేపట్టగానే ఇలా సమస్యలు వచ్చి పడుతున్నాయి. వెంటనే.. భూమన తన మార్క్ నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చిందని హైలెవల్ మీటింగ్ పెట్టేశారు. వెంటనే.. సంచలనం లాంటి నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా వారి ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాలినడక మార్గాలు, ఘాట్‌లలో యాత్రికుల భద్రత దష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం సాయంత్రం తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గహంలో టీటీడీ ఈవో, ఎస్పీ, అటవీ శాఖ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్లలోపు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులతో సహా అనుమతిస్తామన్నారు. పెద్దవారిని రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామని చెప్పారు. నడకదారి భక్తులకు సహాయకారిగా ఉండేలా ప్రతిఒక్కరికీ చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తామని తెలిపారు. భక్తుల రక్షణకు గాను అటవీశాఖ ఆధ్వర్యంలో నిపుణులైన అటవీ సిబ్బందిని నియమించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. భక్తులను గుంపులుగా పంపుతామని, వీరికి సెక్యూరిటీ గార్డులు భద్రతగా ఉంటారని చెప్పారు. సాధు జంతువులకు ఆహారపదార్థాలు అందించడాన్ని, అలాచేసే వారిపైనా, ఆహార పదార్థాలు విక్రయించే వారిపైనా చర్యలు తీసుకుంటామని వివరించారు. నడకదారుల్లో ఉన్న హోటళ్ల నుండి వ్యర్ధాలు వదిలివేయకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నడకదారుల్లో 500 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశామని, అవసరమైతే డ్రోన్లను కూడా వినియోగిస్తామని తెలిపారు. వైల్డ్ లైఫ్ అవుట్ పోస్టులు 24/7 ఏర్పాటు చేసి అనిమల్ ట్రాకర్స్, డాక్టర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. రోడ్డుకిరువైపులా 30 అడుగుల దూరం కనిపించేలా ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫెన్సింగ్ ఏర్పాటుకు అటవీ శాఖ కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తారని, అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రూరమగాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు అలిపిరి, గాలిగోపురం, ఏడో మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద రోజుకు 15 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, మధ్యలో వీటిని స్కానింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గంలో కూడా తిరుమలకు వెళ్లవచ్చని చెప్పారు. ఈసమావేశంలో టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి, అటవీశాఖ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే, జెఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ, తిరుపతి సిసిఎఫ్ పి.నాగేశ్వరరావు, ఎస్వీ జూపార్క్ క్యూరేటర్ సి.సెల్వం, తిరుపతి డిఎఫ్‌ఓ జి.సతీష్, డిఎఫ్‌ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.










