ప్రజాశక్తి - ఆదోని
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైసిపి తీరని అన్యాయం చేసిందని, టిటిడి ఛైర్మన్ పదవి బీసీలకు కేటాయిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రెడ్లకు కేటాయించారని, అందుకే వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు వైసిపి సీనియర్ నాయకులు, బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ రమేష్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆదోనిలో శ్రీకృష్ణ దేవాలయం కమ్యూనిటీ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిటిడి ఛైర్మన్ పదవి బీసీలకు కేటాయిస్తానని గతంలో ఇచ్చిన మాటను జగన్మోహన్ రెడ్డి విస్మరించారని తెలిపారు. మొదటి దఫా రెడ్డి, మరోసారి భూమన కరుణాకర్ రెడ్డికి కేటాయించారని చెప్పారు. ఇన్నాళ్లు జాంగా కృష్ణమూర్తికి ఇస్తామని చెబుతూ మాట తప్పారన్నారు. అందుకే తాను వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన కుటుంబం, తాను దశాబ్దాలుగా కాంగ్రెస్, వైసిపిలోనే కొనసాగామని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగే వరకూ తాను రాష్ట్రవ్యాప్తంగా అందరినీ కలిసి పోరాడతానని తెలిపారు. గతంలో టిడిపి హయాంలో టిటిడి ఛైర్మన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్‌కు కేటాయించారని చెప్పారు. ఇటీవల ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్కటి కూడా కురువ, యాదవులకు కేటాయించలేదన్నారు. టిడిపి బీసీలకు జిల్లా అధ్యక్ష పదవులు, కర్నూలు, నంద్యాల కేటాయిస్తే వైసిపి ఒక్కరితోనే సరిపెట్టిందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాతినిధ్యాన్ని వైసిపి తగ్గిస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కల్పించారన్నారు. జిల్లాలో ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపిలలో తక్కువ జనాభా ఉండే అగ్రవర్ణ కులాల నాయకులే కనబడుతున్నారని తెలిపారు. బీసీలకు జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. త్వరలో బీసీల తరఫున ఉద్యమానికి సిద్ధమవుతామని, బీసీలకు సముచిత స్థానం కల్పించే వరకు పోరాడతామని తెలిపారు. రాష్ట్రంలో బీసీల సత్తాచాటి రెండు పార్టీలకు బుద్ధి చెబుతామని, టిటిడి ఛైర్మన్ పదవి యాదవులకు ఇచ్చే వరకు పోరాడతామని వివరించారు. యాదవ సంఘం నాయకులు హుస్సేనప్ప యాదవ్, హనుమన్న పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రమేష్ యాదవ్










