ప్రజాశక్తి - ఎచ్చెర్ల, శ్రీకాకుళం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం టిటిడి అటవీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్వులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. వెయ్యి రోజులుగా దీక్షలు చేస్తూ పోరాడుతున్న టిటిడి అటవీ కార్మికులకు మద్దతుగా ఎచ్చెర్ల మండల కేంద్రంలో, శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ కూడలి వద్ద సిఐటియు ఆధ్వర్యాన గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో వెయ్యి రోజుల పాటు నిరంతరాయంగా పోరాడిన కార్మిక పోరాటం లేదన్నారు. టిటిడి అటవీ కార్మికులు 200 మంది మూడేళ్లుగా అనేక ఒడిదుడుకులు, ఆటంకాలు, వరదలు, వర్షాలను కరోనా వంటి విషమ పరిస్థితులను సైతం ఎదుర్కొని ఈ నిరసన కార్యక్రమం కార్మికులు సాగిస్తున్నారని తెలిపారు. టిటిడి యాజమాన్యం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కోర్టులు ఆదేశించినా పట్టించుకోవడం లేదన్నారు. టిటిడిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ 24 గంటల్లో రెగ్యులరైజ్ చేస్తానని సిఎం జగన్ హామీనిచ్చారని గుర్తుచేశారు. 2019లో స్వయంగా టిటిడి బోర్డు అటవీ కార్మికులందరికీ టైం స్కేల్ ఇస్తున్నామని తీర్మానం చేసిందని, నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. టిటిడి అటవీ విభాగంలో మొత్తం 362 మంది కార్మికులు పనిచేస్తుంటే, ఇందులో 162 మందిని పర్మినెంట్ చేసి మిగిలిన 200 మంది కార్మికులకు టైమ్ స్కేల్ కూడా ఇవ్వకుండా కార్పొరేషన్‌లో ఏకపక్షంగా కలిపేశారని విమర్శించారు. టిటిడి కార్మికులు ఒంటరిగా లేరని, కార్మికవర్గం యావత్తు వారి పోరాటానికి అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో శ్రామిక మహళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కె.నాగమణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి ఎన్.వి రమణ, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కిషోర్‌కుమార్, ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, బిఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.గోవర్థనరావు, ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, కె.కృష్ణవేణి, పలు యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.










