1075 రోజులకు చేరుకున్న
టిటిడి అటవీ కార్మికుల రిలే దీక్షలు
ఛైర్మన్ భూమన స్పందించాలని విజ్ఞప్తి
ప్రజాశక్తి- తిరుపతిటౌన్: టీటీడీ అటవీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 1075 రోజులకు చేరుకున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తెలిపారు. బుధవారం అటవీ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన కందారపు మురళి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. న్యాయమైన సమస్యల పరిష్కారంకై పోరాడుతున్న అటవీ కార్మికుల పట్ల టిటిడి యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి సబబుగా లేదని ఆయన విమర్శించారు. 2019వ సంవత్సరంలో టైంస్కేల్ ఇస్తామని బోర్డు తీర్మానం చేసిందని, ఆ తీర్మానాన్ని అమలు చేయకపోగా, కొందరిని పర్మినెంట్ చేసి కొందరిని వీధుల పాలు చేయడం సమంజసం కాదని అన్నారు. తిరుపతి శాసన సభ్యుడుగా, స్థానిక ప్రజల వెతలు తెలిసిన భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా సమస్య పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని, పేద అటవీ కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమైన సమస్య పరిష్కారానికి మూడేళ్లుగా నిరాహార దీక్షలు చేయడం ధార్మిక సంస్థలో ధర్మమా అని ప్రశ్నించారు. రాష్ట్ర చరిత్రలో ఇంత దీర్ఘకాలం పాటు సాగుతున్న పోరాటం మరొకటి లేదని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో టిటిడి అటవీ కార్మికుల యూనియన్ నాయకులు సురేష్, సురేంద్ర, కష్ణమూర్తి, కష్ణ, శ్రీనివాసులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు..










