Jul 10,2023 00:02

సమావేశంలో మాట్లాడుతున్న పాశం రామారావు

ప్రజాశక్తి-తాడేపల్లి : మంగళగిరి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్‌ చేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన మంగళగిరి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక మేకా అమరారెడ్డి భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాశం రామారావు మాట్లాడుతూ మంగళగిరి పట్టణ, రూరల్‌ ప్రాంతాల్లో అనేక సమస్యలు తిష్ట వేశాయన్నారు. నియోజకవర్గంలో సుమారు 20 వేల మంది వివిధ ప్రభత్వ స్థలాల్లో ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్నారని, వారందరికీ ఇళ్లపట్టాలు ఇవ్వాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వడంతో పాటు వారు నివశిస్తున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనేక ప్రాంతాల్లో శ్మశాన స్థలాలు లేవని, ఉన్నచోట అభివృద్ధి చేయాలని కోరారు. తాడేపల్లి మంగళగిరి ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. సిఎం నివాసముంటున్న తాడేపల్లిలో డబుల్‌ లైన్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గంలో ట్రాఫిక్‌ పెరిగినందున ప్రమాదాల నివారణకు ఎక్కడికక్కడ సిగల్‌ లైట్లు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్పొరేషన్‌ అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని, అస్తవ్యస్తంగా ఉన్న తాగునీరు, డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఇండోర్‌ స్టేడియంతోపాటు ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, ఐటిఐ కళాశాలల ఏర్పాటు చేయాలని కోరారు. తాడేపల్లి రూరల్‌ గ్రామాల్లో ఇసుక క్వారీలు తెరిచి వందలాది మందికి ఉపాధి కల్పించాలన్నారు. తాడేపల్లి కొండ చుట్టూ ఉన్న ప్రాంతంలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్‌ పనులను వెంటనే అనుమతించాలన్నారు. మూడు రాజధానుల మాట వెనక్కి తీసుకుని అమరావతే ఏకైన రాజధాని అని సిఎం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు, నాయకులు బి.కోటేశ్వరి, ఇ.సుబ్బారెడ్డి, వి.దుర్గారావు, ఎం.భాగ్యరాజు, బాలరాజు పాల్గొన్నారు.