Feb 25,2023 22:43

ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు 

వివిధ శాఖల అధికారులు సమిష్టిగా పనిచేసి శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ళు ఉత్సవాలను విజయవంతం చేయాలని నందిగామ ఆర్డీవో ఎ. రవీంద్ర రావు పేర్కొన్నారు. మార్చి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ళు ఉత్సవాలు ఏర్పాట్లపై శనివారం అమ్మవారి సత్రంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముఖ్యంగా భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉత్సవాల్లో ప్రథాన ఘట్టమైన 9వ తేదీన జరిగే శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు అనిగండలపాడు నుంచి అమ్మవారి ఆలయానికి చేరుకునే ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని, ఎక్కడ గొడవలు, అల్లర్లు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేపట్టాలని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామంలో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించాలని సూచించారు. అలాగే ఉత్సవాల్లో జరిగే గ్రామోత్సవం, దివ్య ప్రభోభోత్సవం కార్యక్రమాలను కూడా సక్రమంగా నిర్వహించా లని అన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి లీలా కుమార్‌ చైర్మన్‌ చెన్న కేశవ రావు లు మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లను చేస్తున్నామని, మున్నేరు లో ప్రత్యేక కేశఖండన శాల జల్లు స్నానాలు, ఆలయం వద్ద క్యూ లైన్స్‌, త్రాగునీరు సదుపాయం, ప్రత్యేక కౌంటర్లు ద్వారా ప్రసాదాలు పంపిణీ, అధికారులకు భోజన సదుపాయాలు, ఐదు రోజుల పాటు వివిధ రకాల సాంస్కతిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో సీఐ నాగ మురళి, తహసీల్దార్‌ లక్ష్మి కళ్యాణి, ఎంపీడీవో ప్రసాదరావు, ఇఇ వైకుంట రావు, ఎఇవో ఉమాపతి, ఎస్‌ఐ హరి బాబూ, ధర్మకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.