తిరుపతిలోనే పవన్ పోటీ
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
'తిరుపతి నుంచి పోటీ చేయి' అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి ప్రజలు అప్పట్లో ఎన్టీఆర్‌ను, తరువాత కొణిదెల చిరంజీవిని ఆదరించారని, తొలి ప్రాధాన్యత తిరుపతికే ఇచ్చి కేంద్రీకరించాలని చెప్పినట్లు తెలుస్తోంది. జనసేన, టిడిపి కలయిక నేపథ్యంలో తిరుపతి వరకూ గ్రీన్‌సిగల్ జనసేనకు ఇచ్చేసినట్లే.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన, టిడిపి పొత్తులు, సీట్లు గురించి చర్చ నడుస్తోంది. మదనపల్లి, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలను జనసేన కోరినట్లు సమాచారం. తిరుపతి లోక్‌సభనూ జనసేన ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో ప్రస్తుత ఇన్‌ఛార్జి, మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ, టిడిపి రాష్ట్ర నాయకులు వూకా విజయకుమార్, టిటిడి మాజీ బోర్డు మెంబర్ ఒవి రమణ పోటీ పడుతున్నారు. వారితో పాటు పొత్తులో భాగంగా జనసేన నుంచి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిరణ్‌రాయల్ ఆశిస్తున్నారు. అధికార పార్టీని బలంగా ఎదుర్కోవాలంటే తిరుపతి లాంటి ప్రాధాన్యత గల నియోజకవర్గంలో పవన్‌కల్యాణే సరైన అభ్యర్థిగా చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. బలిజ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో సాలిడ్‌గా పవన్‌కల్యాణ్‌కు ఓట్లు పడతాయని, విద్యాకేంద్రంగా ఉన్న తిరుపతిలో యువత ఓట్లు జనసేనకు మళ్లించేలా వ్యూహంలో ఉన్నారు. ఏదిఏమైనప్పటికీ బాబు వేసిన 'స్కెచ్' చూస్తుంటే పవన్‌కల్యాణ్ తిరుపతి నుంచే పోటీ చేస్తారనుకోవచ్చు.










