తిరుపతిలో ఎన్‌ఐఏ సోదాలు
ప్రజాశక్తి- తిరుపతి సిటీ, తిరుచానూరు: తిరుపతి నగరంలోని ప్రముఖ న్యాయవాది, హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్య ఇంట్లో ఎన్‌ఐఏ పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు. అహింస నినాదంతో పోరాడిన గాంధీ జయంతి రోజు బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలని కోరుతూ వారి పక్షాన నిత్యం కోర్టులో పోరాడుతున్న న్యాయవాది క్రాంతిచైతన్య ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించడం గమనార్హం. తిరుచానూరు యోగిమల్లవరంలోని ఎస్వీపీ కాలనీలోని ఆయన ఇంటి వద్ద సోదాలు నిర్వహించడంతో చుట్టుపక్కల వారు ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్రకలకలం చోటుచేసుకుంది. తిరుచానూరుతో పాటు గూడూరు సమీపంలోని బాలయ్యగారిపల్లెలో కూడా ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించారు. తిరుపతి జిల్లాలో ఏకకాలంలో రెండు చోట్ల ఎన్‌ఐఏ బందం సోదాలు చేపట్టింది. ఎన్‌ఐఏ సోదాలతో ఒక్కసారిగా నగర్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. నక్సల్స్‌తో సంబంధం ఉన్న వారిపై నిఘా పెట్టిన పోలీసులు, లాయర్ క్రాంతి చైతన్య గతంలో నక్సల్స్ ఉద్యమాల్లో పాల్గొనడంతో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. ఎన్‌ఐఏ సోదాలు దేనికి జరిగాయి, క్రాంతి చైతన్ అరెస్ట్ అయ్యారా లేదా అనే విషయాలు స్థానిక పోలీసులు వెల్లడించాల్సి ఉంది.










