తిరుపతి వ్యతిరేకి బిజెపి : సిపిఎం
ప్రజాశక్తి - తిరుపతి టౌన్
దేశవ్యాప్తంగా నిధులు వెల్లువలా తరలిపోతుంటే నోరు మెదపని బిజెపి, తిరుపతి అభివృద్ధికి టిటిడి నిధులు ఒక్క శాతం కేటాయిస్తే తల్లడిల్లిపోతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఓ ప్రకటనలో విమర్శించారు. తిరుపతి నగరం అభివృద్ధి చెందడం అంటే టిటిడి అభివృద్ధి కావడమేనని, నగరం ఎంత విస్తరిస్తే టిటిడికి అంత లాభదాయకమని అన్నారు. పెరటాసి మాసంలో రెండు లక్షల మంది భక్తులు కొండమీదకు వస్తే నిర్వహించలేక అధికార యంత్రాంగం భీతిల్లిన మాట వాస్తవమని, తిరుపతి నగరంంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోదాత్మక కార్యక్రమాలు పెరగాల్సిన అవసరాన్ని సూచిస్తోందన్నారు. స్మార్ట్‌సిటీ నిధులు మున్సిపాలిటీలకు ఇస్తున్నది రుణమే కాని కేంద్రం దయాదాక్షిణ్యం కాదన్నారు. దేశంలోని అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఇచ్చారన్న వాస్తవాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తిరుపతి నగరాభివృద్ధికి కేంద్రం అదనంగా ఇచ్చింది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం, వైసిపి, జనసేనలతో అపవిత్ర బంధాన్ని బిజెపి ఏ పద్ధతిలో సాగిస్తుందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసన్నారు. టిటిడి చట్టానికి వ్యతిరేకంగా తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని, చట్టానికి లోబడే ఈ నిధులు కేటాయించిన వాస్తవాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. తిరుపతికి టిటిడి కేటాయించే నిధులు శాశ్వతం కావాలని, చట్టరూపంలో రావాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు.
అభివృద్ధి నిరోధకులను అడ్డుకుంటాం
టిటిడి ఉద్యోగసంఘాల మద్దతు
ప్రజాశక్తి - తిరుపతి సిటి
తిరుపతిలో సుమారు లక్ష మంది టీటీడీ, అనుబంధ సంస్థల రెగ్యులర్, కాంట్రాక్టు, కార్పొరేషన్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు నివసిస్తున్నారని, తిరుపతిలో సుమారు 50 శాతం టీటీడీ ఆస్తులు ఉన్నాయని, టీటీడీ బడ్జెట్ లో ఒక్క శాతం నిధులు తిరుపతి అభివద్ధికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి తాము అండగా ఉంటామని టీటీడీ లోని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే శక్తులను బహిరంగంగా అడ్డుకుంటామని వారు చెప్పారు.ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరు చేయడం పట్ల శనివారం సాయంత్రం వారు చైర్మన్ ను ఆయన నివాసంలో కలసి కతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట సుమారు 650 ఎకరాల భూమి సమీకరించి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడం కరుణాక రెడ్డి కే సాధ్యం అయ్యిందని వారు చెప్పారు. టీటీడీ బడ్జెట్ లో తిరుపతి అభివద్ధికి 1 శాతం నిధులు కేటాయించడాన్ని రాజకీయ ప్రయోజనాలకోసం ఒకరిద్దరు రాజకీయ పార్టీల నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడం దురదష్టకరమన్నారు. ఈ అభివద్ధి టీటీడీ ఉద్యోగులకు, యాత్రీకులకు ఉపయోగకరమన్నారు. పారిశుధ్య కార్మికులకు 5 వేల దాకా, కార్పొరేషన్ ఉద్యోగులకు 3 శాతం జీతం పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారనిఅభినందించారు. టిటిడి చైర్మన్ కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల తనకున్న ప్రేమ, అభిమానం వల్లే తాను ఈ నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు. ఉద్యోగులందరికీ ఎప్పుడూ అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి లోని టీటీడీ ఆస్తులపైన మున్సిపల్ కార్పొరేషన్ ఒక్క రూపాయ కూడా పన్ను వేయడం లేదనే విషయం కూడా అందరూ గుర్తించాలని కోరారు. అలాగే టీటీడీ సంస్థలు, నివాస ప్రాంతాలకు మున్సిపల్ కార్పొరేషన్ ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి అభివద్ధి, భక్తుల సదుపాయాల అభివద్ధి విషయాల్లో టీటీడీ, మున్సిపల్ కార్పొరేషన్ పరస్పర సహకారంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
కరుణాకర్‌రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్న ఉద్యోగసంఘాలు










