Dec 23,2022 22:43

నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్మెంట్‌ను కోరిన ఎంపి

తిరుపతి, శ్రీకాళహస్తిలో రోప్‌వే ఏర్పాటుకు వినతి

ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌

పర్వతమాల కార్యక్రమం ద్వారా శ్రీకాళహస్తిలో రోప్‌ వే ఏర్పాటు చేయాలని నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్మెంట్‌ లిమిటెడ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రకాష్‌ గౌర్‌ని తిరుపతి ఎంపీ గురుమూర్తి కలిసి విన్నవించారు. శుక్రవారం ఢిల్లీలోని కార్యాలయంలో ఎంపి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని 26 సంభావ్య ప్రదేశాలను ఎపిటిడిసి గుర్తించి, అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిందని తెలిపారు. శ్రీకాళహస్తిలో జాతీయ రోప్వే కార్యక్రమం 'పర్వతమాల' కింద కొండ ప్రాంతాలలో పట్టణ రద్దీని తగ్గించడానికి అందుబాటులో ఉన్న ప్రాంతాలను అనుసంధానించాలని కోరారు. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్‌ నుండి బస్టాండ్‌, బస్టాండ్‌ నుండి కపిల తీర్ధం, కపిల తీర్ధం నుండి జూ పార్క్‌ వరకు రోప్‌ వే కి అనుకూలంగా ఉటుందని మ్యాప్‌ చూపిస్తూ వారికి వివరించారు. ఈ సందర్భంగా తిరుపతి పట్టణంలో కూడా ట్రాఫిక్‌ రద్దీ నివారించేందుకు రోప్‌ వే ఉపయోగపడుతుందని తెలియజేసారు. తిరుపతిలో, శ్రీకాళహస్తి లో రోప్‌ వే ఏర్పాటుపై ఆ సంస్థ సీఈఓ ఆసక్తి కనబరిచారని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.
తిరుపతిలో నైలిట్‌ నెలకొల్పాలి
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం ఢిల్లీలో ఎన్‌ఐఇఎల్‌ఐటి (నైలిట్‌) డ్కెరెక్టర్‌ జనరల్‌ మదన్‌ మోహన్‌ త్రిపాఠితో భేటీ అయ్యారు. తిరుపతిలో నైలిట్‌ నెలకొల్పేందుకు స్థల సేకరణ, అధ్యయనానికి ప్రతినిధులను పంపినందుకు ధన్యవాదములు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించి శ్రీవారి పుష్ప ప్రసాదంతో తాయారు చేసిన మెమెంటోను అందజేశారు. తిరుపతిలో నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఇఎల్‌ఐటి) కేంద్రాన్ని స్థాపించే ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరారు.