May 16,2023 20:54

తిరుమలగిరి టౌన్‌షిప్‌లో వాటర్‌ ట్యాంకును పరిశీలిస్తున్న ప్రతినిధి బృందం

ప్రజాశక్తి - కర్నూలు హాస్పిటల్‌
కర్నూలు నగర పాలక సంస్థ పరిధి 28వ వార్డు, తిరుమల గిరి టౌన్‌ షిప్‌ కాలనీలో పది రోజుల నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆ కాలనీ వాసుల పరిస్థితి దుర్భరంగా మారిందని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఈ.పుల్లారెడ్డి తెలిపారు. మంగళవారం ఇరిగినేని పుల్లారెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం తిరుమలగిరి కాలనీలో పర్యటించింది. కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి, కాలనీవాసులు సానెం రమణ గౌడ్‌, బి.ఫకీర్‌ రెడ్డి మాట్లాడారు. తిరుమలగిరి టౌన్‌షిప్‌ కాలనీ రెండేళ్ల క్రితం నగర పాలక సంస్థలో విలీనమైందని తెలిపారు. ఈ కాలనీలో సుమారు 300 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని చెప్పారు. కాలనీలో ఇంటి పన్నులు వేయాలంటే సచివాలయ అధికారులు స్థానికంగా ప్రయివేట్‌ వ్యక్తులతో కుమ్మక్కై పెద్ద మొత్తంలో లంచాలు బహిరంగంగా వసూలు చేస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా ప్రభుత్వ వాటర్‌ మెన్‌ ఉండగా అతన్ని విధులు నిర్వహించకుండా బెదిరింపులకు గురి చేస్తూ ప్రయివేట్‌ వ్యక్తితో పనులు చేయించి, ప్రతి ఇంటికీ రూ.200 అక్రమంగా వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారని, కాలనీలో జరుగుతున్న సమస్యలపై స్థానిక కార్పొరేటర్‌ నిర్లక్ష్యం వహించడం దుర్మార్గమని తెలిపారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ కమిషనర్‌, అధికారులు కాలనీలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. కాలనీలో ప్రయివేట్‌ వ్యక్తుల జోక్యం కట్టడి చేయాలని, లేకపోతే పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు నాగరాజు, సివి.వర్మ, హరికృష్ణ, స్థానికులు బి.పక్కిరెడ్డి, రాజేంద్రప్రసాద్‌, మురళీ రెడ్డి, రామచంద్రయ్య, సీడ్‌ మల్లికార్జున పాల్గొన్నారు.