ప్రజాశక్తి - తుళ్లూరు : విద్యుత్ ఉద్యోగులకు, కార్మికులకు నష్టం చేయాలనే లక్ష్యంగా పిఆర్‌సి ఒప్పందం ఉందని, ఈ తిరోగమన పిఆర్‌సిని వెంటనే రద్దు చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఎపి విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ నాయకులు బి.లక్ష్మణరావు అన్నారు. శుక్రవారం అమరావతి రాజధాని రాయపూడిలోని వైఎస్‌ఆర్ విద్యుత్ భవన్ వద్ద స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. లక్ష్మణరావు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఉద్యోగులు, కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం,విద్యుత్ యాజమాన్యం, పవర్ జేఏసీ కుదుర్చుకున్న ఒప్పందం ఇంజినీర్లు, విద్యుత్ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు, పీస్‌రేట్ కార్మికులకు నష్టదాయకంగా ఉందని వివరించారు. జెఎల్‌ఎం గ్రేడ్ 2లకు వేతన ఒప్పందం వర్తించదని, తక్షణమే వేతన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. 2014లో ఒకే వేతనం పొందిన తెలంగాణ, ఆంధ్ర విద్యుత్ ఉద్యోగులకు ఆ తర్వాత జరిగిన రెండు పిఆర్‌సిల్లో రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు, కార్మికులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. తెలంగాణ కంటే 30 శాతం తక్కువ వేతనాలతో ఇక్కడ ఉద్యోగులు పని చేస్తున్నారన్నారు. జెఎల్‌ఎం గ్రేడ్-2లకు అసలు ఈ వేతన ఒప్పందం వర్తించదని, తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. కాంట్రాక్టు కార్మిక సంఘాలతో సంబంధం లేకుండా ఏ విధంగా ఒప్పందం కుదుర్చుకుంటారని ప్రశ్నించారు. 2022 పిఆర్‌సి అమలు చేయాలంటే 2018 పిఆర్‌సికి రెండు శాతం కలిపి అమలు జరుపుతామనే ఒప్పందం ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను నిట్టనిలువునా ముంచటమేనన్నారు. అర్హతకు అనుగుణంగా క్రమబద్ధీకరణ చేస్తామని ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన జగన్ మోహన్‌రెడ్డి దాన్ని విస్మరించారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను సంస్థలో విలీనం చేసుకొని రూ.43 వేల జీతం ఇస్తుంటే ఇక్కడ మాత్రం ఇప్పుడు పెంచిన వేతనాలతో రూ.27 వేలే ఇస్తున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులలో కొత్తగా చేరిన వారికి ఈ రాష్ట్రంలో కేవలం రూ 13 వేలే ఇస్తున్నారని, చాలీచాలని జీతాలతో కుటుంబాలు ఏ విధంగా గడపాలని ప్రశ్నించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, డైరెక్ట్ పేమెంట్ ఇవ్వటం ద్వారా సంస్థకూ ఇబ్బంది లేకుండా, నిధులు వృథా కాకుండా ఉంటాయని అన్నారు. వేతన ఒప్పందం రద్దు చేసే వరకు,ఉద్యోగులకు, కార్మికులకు న్యాయం జరిగే వరకూ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సిఐటియు రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.భాగ్యరాజు మాట్లాడుతూ మిగతా ప్రభుత్వ శాఖల్లో పర్మినెంట్ చేస్తూ విద్యుత్ శాఖలో మాత్రం ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఎండనకా వాననకా ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరం పని చేస్తుంటే వారిపై చిన్నచూపు సరికాదన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ నాయకులు జి.పవన్, టి.వర్మ, వెంకటస్వామి, సురేష్, రాజేష్ పాల్గొన్నారు.










