Jul 29,2023 23:25

తినరు.. మాట వినరు..

- ఫోన్‌ వ్యసనంతో పిల్లల ప్రవర్తనలో మార్పులు
- చేతికి ఫోన్‌ ఇస్తే గానీ అన్నం తినని పరిస్థితి
- మరికొందరు నిరంతరం ఆన్‌లైన్‌ గేమ్స్‌లో తలమునకలు
- చదువుపై దష్టిసారించకపోవడం, విపరీతమైన కోపం,
- చిరాకు, చెప్పిన మాట వినకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం
- అశ్రద్ధ చేయొద్దంటున్న వైద్యులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం : 
మైదానంలో ఆటలాడే చిన్నారుల సంఖ్య తగ్గింది. ఇళ్లల్లో నాలుగు గోడల మధ్య ఆన్‌లైన్‌లో ఆటలాడుతున్న చిన్నారుల సంఖ్య పెరిగిపోతుంది. దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఫ్రీ ఫైర్‌, పబ్జీ వంటి గేమ్స్‌ వల్ల పిల్లల్లో అగ్రెసివ్‌ యాటిట్యూడ్‌ పెరుగుతోందని, ఏ విషయమైనా సున్నితంగా చెప్పేందుకు, చెప్పిన మాట వినేందుకు ఇష్టపడడం లేదని అంటున్నారు. సరిగా నిద్రపోవడం లేదని, నిద్రపోతున్నప్పుడు కూడా ఆ గేమ్స్‌ ఆడుతున్నట్లు గానే వ్యవహరిస్తున్నారంటూ పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను మానసిక వైద్యుల వద్దకు తీసుకొస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ తరహా కేసులు పెరుగుతున్నాయని, సకాలంలో గుర్తించకపోతే తీవ్ర సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రెండు రకాల వ్యసనాలు
ప్రస్తుతం పిల్లల్లో రెండు రకాలైన వ్యసనాలు కనిపిస్తున్నాయి. ఒకటి స్మార్ట్‌ఫోన్‌, రెండోది ఆన్‌లైన్‌ గేమింగ్‌. స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం ఉన్న పిల్లలు ఫోన్‌ తీసుకుని తమకు నచ్చిన వీడియోలు, బొమ్మలు వంటివి చూస్తున్నారు. ఫోన్‌ అడిగినప్పుడు ఇవ్వకపోతే ఊరుకోరు. ఫోన్‌ ఇస్తేనే గానీ అన్నం తినరు. చెప్పిన మాట వినరు. ఇలా అడిగిన వెంటనే ఫోన్లు ఇచ్చేయడం వల్ల సకాలంలో చిన్నారులు మాట్లాడలేకపోతున్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఫోన్‌లోనే గడిపేస్తుండడం వల్ల ఈ సమస్య పెరుగుతోందంటున్నారు. ఈ చిన్నారుల్లో కళ్ల సంబంధిత సమస్యలు, నిద్రలేమి వంటి ఇబ్బందులు ఉంటున్నాయి. ఈ వ్యసనం నుంచి పిల్లలను వీలైనంత వేగంగా బయటకు తీసుకొచ్చేందుకు అవకాశముంది.
రెండోది గేమింగ్‌ వ్యసనం. ఈ సమస్య ఇప్పుడు తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తోంది. దీని బారినపడిన చిన్నారుల్లో అనేకరకాల ఇబ్బందులు ఉంటున్నాయి. ఈ వ్యసనం కలిగిన పిల్లల్లో ఎక్కువ మంది ఫ్రీ ఫైర్‌ తదితర గేమ్స్‌ ఆడుతున్నారు. ఇవి చిన్నారుల ప్రవర్తనలో మార్పులకు కారణమవుతున్నట్టు చెప్తున్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం ఏడేళ్ల చిన్నారుల నుంచి ఉంటోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తినాలి అనిపించకపోవడం, నిద్రల్లో అతిగా ప్రవర్తించడం, వింతగా మాట్లాడడం, ఏకాగ్రత చూపించలేకపోవడం, చిన్న చిన్న విషయాలకు అతిగా స్పందించడం, కేకలు వేయడం, ఇరిటేషన్‌, కోసం వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. ఎక్కువ మంది చిన్నారుల్లో నిద్రలేమి ప్రధాన సమస్యగా ఉంటుంది.
బయటపడే మార్గాలు ఇవే...
స్మార్ట్‌ఫోన్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం అనేది మూడేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల్లో ఎక్కువగా ఉంటోంది. ఈ లక్షణాలతో బాధపడే చిన్నారులను వెంటనే గుర్తించి సైకాలజిస్టుల వద్దకు తీసుకెళ్లాలి. కౌన్సెలింగ్‌, గేమ్‌ టాస్కింగ్‌ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడేలా చేస్తారు. బ్లాక్స్‌ బిల్డింగ్‌ వంటి ఫిజికల్‌ టాస్కులు ఉంటాయి. తల్లిదండ్రులు వీరిని ప్రతిరోజూ యోగా, మెడిటేషన్‌ వంటి కోర్సులకు, శారీరక శ్రమ కలిగించే ఆటలాడే ప్రాంతాలకు తీసుకెళ్లాలి. స్విమ్మింగ్‌, మ్యూజిక్‌ వంటి కోర్సుల్లో చేర్పించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
దూకుడుగా ప్రవర్తన
ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనం వల్ల పిల్లలు దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. రాత్రుళ్లు విపరీతమైన ధోరణితో వ్యవహరిస్తున్నట్టు తల్లిదండ్రులు చెప్తున్నారు. తినడం లేదు, చెప్పిన మాట వినడం లేదు, చదవడం లేదు, రాత్రిళ్లు నిద్రపోవడం లేదంటూ పిల్లలను తీసుకువస్తున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. ప్రతి చిన్నదానికి కోపగించుకోవడం, ఇరిటేషన్‌, నిద్ర భంగం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం కావాలి. కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. నిద్ర రావడం లేదంటూ పిల్లలు ఎక్కువగా చెబుతున్నారు. అలవాట్లలో కొన్ని మార్పులు చేయడం వల్ల సాధారణ స్థితికి తీసుకురావచ్చు.
- డాక్టర్‌ సాయిలహరి, మానసిక వైద్యులు
జెమ్స్‌ హాస్పిటల్‌, రాగోలు