ఆధార్, ఇ-కెవైసి అనుసంధాన చిక్కుముళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు తిండి గింజలు దూరమయ్యే పరిస్థితులు నెలకొనడం బాధాకరం. వైసిపి అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో సుమారు 1.52 కోట్ల రేషన్ కార్డులుండేవి. నవశకం సర్వేతో గతేడాది 8.4 లక్షల కార్డులను బోగస్ అంటూ తొలగించిన ప్రభుత్వం ఇటీవల ఇ-కెవైసి సాకుతో మరో 5 లక్షల కార్డులను తొలగించినట్లు కథనాలు వస్తున్నాయి. అర్హుల కార్డులనూ ఏరివేస్తోందన్న ఆరోపణలున్నాయి.
దేశంలోనే భారీ స్థాయిలో సంక్షేమ పథకాలను అమల్జేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ప్రజల నోటికాడ ముద్దను లాగేసుకోవడం ఏ పాటి సంక్షేమమో సెలవివ్వాలి. కోవిడ్ మహమ్మారి మూలాన జీవనోపాధులు కోల్పోయి ప్రజల కొనుగోలు శక్తి కొడిగట్టిపోయింది. ఈ కష్టకాంలో సార్వత్రిక ప్రజా పంపిణీ (పిడిఎస్) ద్వారా ప్రజలందరికీ ఆహార ధాన్యాలను, పోషకాహారాన్ని అందజేయడం మానేసి పేదల తిండిపైనా షరతులు పెట్టడం దారుణం. ఆర్థిక రథం సాఫీగా సాగిపోవాలంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. ఉపాధి అవకాశాలు విరివిగా కల్పించడమే దానికి మార్గం. తమిళనాడు ప్రభుత్వం పట్టణాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని అమల్జేసేందుకు ఇటీవల శ్రీకారం చుట్టింది. ఇలాంటి ఆలోచనలు చేయకుండా రేషన్ కార్డుల తగ్గించేయడం తగదు. బియ్యం, పంచదార, పప్పులతో పాటు 16 నిత్యావసర సరుకుల్ని చౌక డిపోల ద్వారా కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. దేశమంతటా కేవలం దారిద్య్రరేఖ (బిపిఎల్) దిగువనున్న వారికే చౌక డిపోల ద్వారా సరుకుల్నిస్తుంటే అక్కడ మాత్రం బిపిఎల్ ఎగువనున్న వారికి కూడా సరఫరా చేయడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టాలి.
వాస్తవానికి రేషన్ కార్డుల తొలగింపు పాపం వెనుక ప్రధాన ముద్దాయి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే. 'వన్ నేషన్..వన్ రేషన్'లో భాగంగా రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది కేంద్రమే. పేదల బాగు కంటే ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి లాక్కునేందుకే ఈ విధానం. తిండి గింజల పంపిణీ వ్యవస్థను ప్రయివేటుకు అప్పగించే మార్గం సుగమం అవుతుంది. నగదు బదిలీ మాయమాటలతో ఇప్పుడు వంట గ్యాస్ రాయితీని ఎగ్గొట్టినట్టే రేపు తిండి గింజలనూ ఎగ్గొట్టే ప్రమాదముంది. దేశంలో అతి పెద్ద మార్కెట్‌గా ఉండే తిండి గింజలపై ప్రయివేటు పెత్తనం చెలాయించడం మొదలైతే ఆహార భద్రత హక్కు నీరుగారిపోతుంది. దేశంలో 23.58 కోట్ల రేషన్ కార్డులున్నాయని అంచనా. వీటిలో 4.39 కోట్ల బోగస్ కార్డుల పేరిట తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. వాస్తవానికి వాటిలో అత్యధికం ఆధార్ సీడింగ్ కానివి, మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలతో ఇ-కెవైసి పూర్తికాకపోవడం, తదితర సాంకేతిక పరమైన అవరోధాలతో తెగ్గోసినవే. ఇంత పెద్ద సంఖ్యలో కార్డుల తెగ్గోతపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరిజనులు, నిరుపేదల ఆహార ధాన్యాలకు కూడా ఆంక్షలు పెడతారా అంటూ నిలదీసింది.
ఆహార భద్రత హక్కు అంటే మరో అర్ధంలో జీవించే హక్కు. రేషన్ కార్డు ఆహార భద్రతకు ప్రతీక. ఇప్పుడు రేషన్ కార్డు నిరాకరించడమంటే జీవించే హక్కును తిరస్కరించడమే అవుతుంది. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని, ఎటువంటి గడువులు ఉండరాదని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) ఇటీవల కేంద్రానికి, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది ఇందుకే. ప్రస్తుతం ప్రజా పంపిణీ ఆహార ధాన్యాలకే పరిమితమైవుంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తిండి గింజలతో పాటు పోషకాల స్థాయి పెంచే పుప్పు ధాన్యాలు, వంట నూనెలు, తృణ ధాన్యాలు కూడా చేర్చాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆదేశాలు ఇవ్వడం సముచితం.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ వినాశకర సంస్కరణలకు తలూపడటం మాని ప్రజల బాగుకోసం పాటుపడాలి. రాష్ట్రాల హక్కులను హరించే బిజెపి కేంద్రీకృత చర్యలపై తమిళనాడు, కేరళ వంటి కలిసొచ్చే రాష్ట్రాలతో కలిసి అడుగు ముందుకేయాలి. తిండి గింజలను ప్రజలకు అందించేలా ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చెయ్యాలి.










