Jun 26,2023 22:45

'పోలవరం పోరుకేక' యాత్రకు జిల్లాలో ఘనస్వాగతం
భారీగా తరలొచ్చిన నాయకులు, కార్యకర్తలు, నిర్వాసితులు
సంఘీభావం ప్రకటించిన టిడిపి, జనసేన నాయకులు
తొలిరోజు ఐదు గ్రామాల మీదుగా 12 కిలోమీటర్ల పాదయాత్ర
ప్రత్యేక ఆకర్షణగా యువతీ యువకులు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం

పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా సిపిఎం చేపట్టిన 'పోలవరం పోరుకేక' మహా పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ నెల 20న అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాకలో మొదలైన పాదయాత్ర సోమవారం మధ్యాహ్నం కూనవరం చేరుకుంది. అక్కడ నుంచి పాదయాత్ర బృందం పడవలపై గోదావరి దాటి జిల్లాలోని వేలేరుపాడు మండలం రుద్రమ్మకోట గ్రామంలోకి ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి సిపిఎం రాష్ట్ర నాయకులు వి.వెంకటేశ్వర్లు, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి, సిపిఎం జిల్లా కార్యదర్శి రవి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, నిర్వాసితులు స్వాగతం పలికారు. మహిళలు ఎదురెళ్లి పూలమాలలు వేసి బొట్టు పెట్టి హరతులిచ్చి నేతలకు స్వాగతం పలికారు. అనంతరం రుద్రమ్మకోట గ్రామంలో బహిరంగ సభ ఆ మండల నాయకులు ధర్ముల రమేష్‌, మడిది దుర్గారావు ఆధ్వర్యాన సాగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ మండలాన్ని యూనిట్‌గా గుర్తించి నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గతేడాది ముంపు గ్రామాలన్నింటినీ సర్వేలో కలపాలని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో దీక్షలు చేస్తే 13 గ్రామాలను కలిపామని చెప్పి రెండు నెలల తర్వాత ముంపులో లేవంటూ నిర్వాసితులను మోసం చేశారన్నారు. ఎ, బి, సి బ్లాక్‌లతో సంబంధం లేకుండా ముంపు గ్రామాలకు పరిహారం ఇవ్వాలని కోరారు. టిడిపి మండలాధ్యక్షుడు అమరవరపు అశోక్‌, జనసేన మండలాధ్యక్షులు గణేశుల ఆదినారాయణ మాట్లాడుతూ పోలవరం పోరుకేక యాత్రకు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. నిర్వాసితుల సమస్యలు అనేకం ఉన్నాయని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని చెప్పారు. సిపిఎం ఎన్నో కష్టాలు ఓర్చి నిర్వాసితుల కోసం ఈ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. నిర్వాసితులంతా ఒక్కటై ముందుకు సాగాలన్నారు. అనంతరం పాదయాత్ర బృంద నాయకుడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులను ప్రభుత్వం నిలువునా ముంచేసేందుకు పూనుకుందన్నారు. ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ సమస్య ఉందన్నారు. అంతా కలిసికట్టుగా పోరాడినప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. వచ్చే నెల నాలుగో తేదీలోపు సమస్యల పరిష్కారంపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే ప్రతి ఊరునూ సమరక్షేత్రంలా మార్చి ఉద్యమించేలా ప్రణాళిక రూపొందిస్తామన్నారు. పాదయాత్ర బృందం భోజన విరామం అనంతరం యాత్ర కొనసాగించింది. రుద్రమకోట, మద్దిగట్ల, వసంతవాడ, ఆర్వోపల్లి మీదుగా కుక్కునూరు మండలం దాచారం చేరుకుని రాత్రి బస చేసింది.
గిరిజనులపై యుద్దం ప్రకటించిన బిజెపి
లోకనాధం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

పాదయాత్ర బృందం వసంతవాడ చేరుకున్నాక అక్కడ సభ నిర్వహించారు. అలసిన పాదయాత్ర బృందానికి ప్రజానాట్యమండలి కళాకారులు నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఉత్సాహం నింపారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాధం మాట్లాడుతూ బిజెపి వచ్చాక గిరిజనులపై యుద్ధం ప్రకటించిందన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు చట్టప్రకారం పరిహారం ఇవ్వకుండా మోసగిస్తుందన్నారు. వైసిపి, టిడిపి 2013 భూసేకరణ చట్టం అమలు చేయడం లేదన్నారు. భూమికి భూమితోపాటు పునరావాసం, పరిహారం ఏ ఒక్కటీ ఇవ్వలేదన్నారు. 1/70 అటవీ హక్కుల చట్టంపై బిజెపి దాడి చేస్తుందన్నారు. టిడిపి, జనసేన నిర్వాసితుల పక్షాన ఉంటారో, లేదో చెప్పాలన్నారు. గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులోని ఏడు మండలాల ప్రజలను పాలకులు ముంచడం దారుణమన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన వైసిపి కాలక్షేపం చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఏం చెప్పారు.. ఏం చేశారు అని అడగడానికే పోలవరం పోరుకేక అని అన్నారు.
పోరాటానికి సిద్ధంగా ఉండాలి..
వి.శ్రీనివాసరావు

వసంతవాడ సభలో నిర్వాసితురాలు మడకం అక్కమ్మ గ్రామంలోని నిర్వాసితుల సమస్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. తమ గ్రామం ముంపులో ఉండగా 45.72 కాంటూరులో పెట్టారన్నారు. భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఏదీ ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ఇదే సమస్య ఉందని, పోరాడటానికి అంతా సిద్ధంగా ఉండాలని చెప్పారు. స్థానిక ఎంఎల్‌ఎ ఉలుకు పలుకు లేని బాలరాజుగా ఉన్నారన్నారు. వరదల్లో దెబ్బ తిన్న బాధితులకు జగన్‌ రెండు కొవ్వొత్తులిచ్చి సరిపెట్టారని ఎద్దేవా చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా యువత
పోలవరం పోరుకేక యాత్రలో యువతీ యువకులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. పాదయాత్ర బృందంలో అత్యధికంగా 18 ఏళ్లు నిండిన యువతీ యువకులే ఉన్నారు. యువత ఉత్సాహంగా అడుగులు వేస్తుంటే నాయకులు మరింత ఉత్సాహంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. దీంతో పాదయాత్ర ఉప్పెనలా ముందుకు సాగుతోంది.
నేడు పాదయాత్ర ఇలా..

పాదయాత్ర రెండో రోజు మంగళవారం ద్రాచారం నుంచి కుక్కునూరు, లంకలపల్లి, దిబ్బగూడెం మీదుగా జీలుగుమిల్లి మండలంలోకి ప్రవేశించి రాచన్నగూడెం మీదుగా కామయ్యపాలెం వరకు 19 కిలోమీటర్ల మేర సాగనుంది. మండల కేంద్రం కుక్కునూరులో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి రానున్నారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి, డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న, వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర నాయకులు బుర్రి ప్రసాద్‌, రామకృష్ణ, నగ్మ, కారం లక్ష్మి, వాణిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
డిపిఆర్‌పై కేంద్రం రాష్ట్రంతో ఆడుకుంటోంది
అమరవరపు అశోక్‌, టిడిపి నాయకులు

పోలవరం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన డిపిఆర్‌పై కేంద్రం ఆడుకుంటోంది. దీనికి వైసిపినే ప్రధాన కారణం. నిర్వాసితుల సమస్యలు చాలా అలానే ఉన్నాయి. లక్ష కుటుంబాలకుపైగా ఉన్న నిర్వాసితుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు ఇళ్ల నిర్మాణం కూడా చేయలేదు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి అంటూ విడదీసి వివక్ష ప్రదర్శిస్తున్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది. యువతకు సంబంధించి కటాఫ్‌ తేదీ పెంచలేదు. సిపిఎం పాదయాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.
ప్రభుత్వం నుండి సాయం అందలేదు
అంబటి ముత్యాలు, రుద్రమ్మకోట

గోదావరి వరదలకు ఇల్లు కూలిపోవడంతో ఏ దిక్కూ లేక ఒంటరిగా గుడారం వేసుకొని ఉంటున్నాను. దెబ్బతిన్న ఇంటికి నష్ట పరిహారం కూడా నాకు రాలేదు. ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకోవాలి.
నిర్వాసితులంతా ముక్తకంఠంతో చేయిచేయి కలపాలి
గణేష్‌ ఆదినారాయణ జనసేన నాయకులు

సిపిఎం పాదయాత్రకు అంతా సంఘీభావం తెలపడంతో పాటు నిర్వాసితులంతా ముక్తకంఠంతో చేయి చేయి కలపాలి. ఈ ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ రూ.10 లక్షల హామీ గాని, భూములకు ఇస్తానన్న రూ.5 లక్షల పరిహారం ఏ ఒక్కటీ ఇవ్వలేదు. నాలుగేళ్లలో ఇళ్ల నిర్మాణం గాని, వసతులుగాని కల్పించలేదు. గోదావరి వరద సమయంలో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇవ్వలేదు. నిర్వాసితుల కోసం సిపిఎం చేస్తున్న పాదయాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.
మూడు నెలలు వయస్సు తగ్గిందన్నారు
పూజారి నాగమణి, రుద్రమ్మకోట

నా కుమారునికికి 18 సంవత్సరాలకు మూడు నెలల వయస్సు తగ్గిందని అధికారులు సర్వేలో నమోదు చేయలేదు. ఎంత బతిమాలినా పరిహారం రాదని అధికారులు ఖరాఖండీగా చెప్పారు. ప్రస్తుతం నా కుమారుడి వయస్సు 25. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 18 సంవత్సరాలు నిండిన వారి జాబితాలో నా కుమారుడి పేరు చేర్చి పరిహారం ఇవ్వాలి.
ప్రతియేటా ఈ బాధలు పడలేం
బురదరాజు రాములమ్మ, రుద్రమ్మకోట

ప్రతియేటా వచ్చే గోదావరి వరదలకు ఇల్లు మునగడంతో సామాన్లను ఇళ్లలోనే వదిలి కట్టుబట్టలతో వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాకు వచ్చే పునరావాస పరిహారం, ఇంటి పరిహారం ఇచ్చి మాకు కేటాయించిన ఇళ్లలోకి తరలించాలి. గతేడాది వచ్చిన వరదలకు నా ఇల్లు పూర్తిగా పడిపోయింది. ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు.