Jun 21,2023 00:44

భారీ జనసమూహంతో జరుగుతున్న పాదయాత్ర, అగ్రభాగాన విజ్జూకృష్ణన్‌, వి.శ్రీనివాసరావు తదితరులు

సిపిఎం మహాపాదయాత్రకు ఘన స్వాగతాలు
ప్రజాశక్తి-ఎటపాక, చింతూరు

పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు నాయకత్వంలో మంగళవారం ప్రారంభమైన పోరుకేక మహాపాదయాత్రకు నిర్వాసిత గ్రామాల్లో ప్రజలు తిలకం దిద్దు, హారలిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ పాదయాత్రను ఎటపాక మండలం నెల్లిపాక గ్రామంలో మంగళవారం అఖిల భారత కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌ జెండా ఊపి ప్రారంభించారు. నిర్వాసితులు పూలమాలను వేసి పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. కళాకారులకు, కార్యకర్తలకు, నిర్వాసితులకు అల్పాహారం, తాగునీరు కల్పించారు. పాదయాత్రకు అగ్రభాగాన కళాకారులు ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ డోలు కొమ్ము రేల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నెల్లిపాకలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సిపిఎం శ్రేణులు, నిర్వాసితులు ట్రాక్టర్లలోనూ, మ్యాజిక్‌ ఆటోల్లోనూ, మోటార్‌ బైకులపైనా వందలాదిగా తరలివచ్చారు. ఎర్రని ఎండను సైతం లెక్కచేయకుండా ఎర్రజెండాలతో పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో నెల్లిపాక ప్రధాన కూడలి ఎరుపెక్కింది. బహిరంగ సభ అనంతరం ప్రారంభమైన పాదయాత్ర తోటపల్లి చేరుకుంది. అక్కడ మధ్యాహ్నం భోజనం అనంతరం ప్రారంభమైన పాదయాత్ర గన్నవరం, గౌరీదేవిపేట, నందిగామ మీదుగా మురుమూరు వరకు సాగింది. గన్నవరం గ్రామంలో సిపిఐ నాయకులు పాదయాత్ర బృందానికి పూలమాలవేసి స్వాగతం పలికారు. అనంతరం పోలవరం ఉద్యమకారుడు, రైతు సంఘం నాయకుడు కందుల శ్రీనివాస్‌ స్తూపనికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ పాదయాత్రలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్‌, ఎపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు, రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌, ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి, పశ్చిమగోదావరి జిల్లా నాయకులు బలరాం, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, మహిళా సంఘం రాష్ట్ర నాయకులు కుంజా రాధ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, లోతా రామారావు, మోడం నాగయ్య. విఆర్‌.పురం ఎంపిపి కారం లక్ష్మి. కూనవరం వైస్‌ ఎంపిపి కొమరం పెంటయ్య, డివైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి రాము, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు ప్రసన్న, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, పల్లపు వెంకట్‌, కూనవరం నాయకులు మేకల నాగేశ్వరరావు, చింతూరు మండల కార్యదర్శి సీసం సురేష్‌, ఎటపాక మండల కార్యదర్శి ఐ.వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
నందిగామ పంచాయతీ తీర్మానం అందజేత
సిపిఎం మహా పాదయాత్ర బృంద నాయకుడైన రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుకు ఎటపాక మండలం నందిగామ పంచాయతీ గ్రామ సభ తీర్మానాన్ని అందజేశారు. 2022 గోదావరి వరదలను ప్రామాణికంగా తీసుకొని నందిగామ పంచాయతీలోని నందిగామ, నందిగామపాడు గ్రామాలను 41.15 కాంటూరులో చేర్చి పునరావాసం కల్పించాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హామీ మేరకు గతంలో రూ.1.15లక్షలు పరిహారం ఇచ్చిన భూములకు రూ.5లక్షలు చెల్లించాలని, రాబోయే గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలుగా నిత్యవసర సరుకులు, టార్పాలిన్లు, కిరోసిన్‌/సోలార్‌ లాంతర్‌ తదితరాలు సిద్ధం చేసి ఉంచాలని పంచాయతీ చేసిన గ్రామసభ తీర్మానాన్ని గ్రామ ప్రజలు శ్రీనివాసరావుకి అందించారు.
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయండి : విఎస్‌ఆర్‌
ఎటపాక : పాదయాత్ర సందర్భంగా నందిగామలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ గతేడాది జూలైలో వరదల కారణంగా నందిగామ గ్రామం పూర్తిగా మునిగినా నష్ట పరిహారం చెల్లించలేదని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యంపై 3గంటల పాటు రాస్తారోకో చేసారని, అందులో తను కూడా పాల్గొన్నానని గుర్తు చేశారు. కానీ నేటికీ ఈ గ్రామానికి వరద నష్ట పరిహారం చెల్లించలేదని, 41.15 కాంటూరులో చేర్చలేదని పేర్కొన్నారు. మాట తప్పం.. మడమ తిప్పం అనే జగన్‌ గతంలో రైతులకు రూ.1.15లక్షలు ఇచ్చిన రైతులకు రూ.5లక్షల ఇస్తామని వాగ్దానం చేసిన హామీ ఏమైందని ప్రశ్నించారు. 4సంవత్సరాలు గడిచినా ఇచ్చిన మాట నెరవేర్చక పోవడం మడమ తిప్పడం కాదా అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులు పరిహారం పునరావాసం అడుగుతుంటే వినిపించడం లేదా అన్నారు. తాడేపల్లి పాలస్‌లో పడుకున్నావా అంటూ మండిపడ్డారు. పోలవరం నిర్వసితులందరికీ ఒకే సారి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.