Jun 24,2023 01:45
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సజ్జా హేమలత

ప్రజాశక్తి-చీరాల: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని, తాను టిక్కెట్టు ఆశించి చీరాలకు రాలేదని, పార్టీ బలోపేతం కోసం జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ తనను చీరాలకు పంపించారని, టిడిపి కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారని టిడిపి నాయకురాలు, పొన్నూరు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సజ్జా హేమలత అన్నారు. స్థానిక లైఫ్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌లో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చీరాల పరిస్థితులను అడిగారన్నారు. చీరాలలో బీసీ వర్గాలు అధికంగా ఉండటంతో బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, అదేవిధంగా ప్రజలు ఎక్కువగా స్థానికంగా ఉండే నాయకులనే కోరుకుంటున్నారని గతంలో పోతుల సునీత, మరొకరు స్థానికులుగా కాకపోవడంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్లు తన సమాచారాన్ని తెలిపామని అన్నారు. స్థానిక నేతలకు అవకాశం కల్పిస్తే ప్రజల్లో నమ్మకం ఏర్పడి పార్టీ గెలుపునకు దోహదపడుతుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని అన్నారు. తాను పొలిటికల్‌ ఫ్యామిలీ నుంచి వచ్చానని, గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా సజ్జ చంద్రమౌళి పనిచేశారని, వదిన పన్నెం కస్తూరిబాయి కూడా వేటపాలెం జడ్పిటిసిగా సేవలు అందించారని అన్నారు. చీరాలతో తనకు ఎంతో అనుబంధం ఉందని, తమ బంధువులు అందరూ చీరాల ప్రాంతంలోనే ఉన్నారని, పలు పదవులలో ఆనాడు కొనసాగారని గుర్తు చేశారు. అయితే 2014లో తాను నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించానని, అయితే తమ అధినేత చంద్రబాబు పొన్నూరులో మున్సిపల్‌ చైర్మన్‌గా పోటీ చేయమని పంపించారని అన్నారు. 2019లోనూ చీరాల ప్రాంతానికి వచ్చానని, ఆనాటి పరిస్థితుల రీత్యా మౌనం వహించాల్సి వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తనతో మాట్లాడారని, పార్టీ బలోపేతానికి చీరాలలో పనిచేయాలని సూచించారని అన్నారు. నియోజకవర్గంలో ఇన్‌ఛార్జిగా ఉన్న ఎంఎం కొండయ్యతో కలిసి పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళతానని పేర్కొన్నారు. అయితే పార్టీ సూచనల మేరకు తాను పనిచేస్తానని, టిక్కెట్‌ విషయం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని అన్నారు. తాను అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానని, ట్రస్టు ద్వారా పేదలకు వైద్య సేవలు అందించడంతోపాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తెలుగుదేశం పట్ల మరింత మక్కువతో పని చేస్తానని ఆ దిశగానే చీరాల ప్రాంతంలో లైఫ్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రారంభించామని తెలిపారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ చీరాల ప్రాంతవాసులతో నిత్యం కలిసి ఉంటూ పార్టీని ముందుకు తీసుకు వెళ్తానని ఆమె అన్నారు.