Sep 27,2023 21:28

టికెట్ల టెన్షన్‌

టికెట్ల టెన్షన్‌
రిజర్వుడు స్థానాలన్నీ
కొత్త
వారికేనా ...?
వైసిపి ఎంఎల్‌ఎల్లో ఆందోళన
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
'కొందరికి టికెట్లు రావచ్చు.. మరికొందరికి రాకపోవచ్చు.. రానివారికి ప్రత్యామ్నాయం చూపిస్తాం.. గెలుపే లక్ష్యంగా అందరూ పనిచేయాలి.. 175కు 175 సీట్లు గెలవడమే టార్గెట్‌' అని సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. దీంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధికార పార్టీ ఎంఎల్‌ఎల్లో కలవరం మొదలయ్యింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జరిపిన పర్సనల్‌ సర్వేలో తమకు ఎన్ని మార్కులొచ్చాయోనన్న టెన్షన్‌ వారిలో మొదలయ్యింది. ఆ విధంగా చూస్తే తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఏడూ వైసిపి ఎంఎల్‌ఎలే ఉన్నారు. వీటిలో మూడు రిజర్వుడు ఉన్నాయి. మూడు రిజర్వుడులోనూ కొత్తవారికి అవకాశం కల్పించి, పాతవారిని పక్కన పెడతారని సమాచారం. అలాగే చిత్తూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జగన్‌ జరిపిన సర్వేలో రెండు రిజర్వు స్థానాల్లో కొత్తవారిని, రెండు జనరల్‌ స్థానాల్లో గెలుపు గుర్రాలను మార్పు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పంలో చంద్రబాబుకు పోటీగా ఎంఎల్‌సి భరత్‌ను ఎప్పటినుంచో బరిలో దింపి ఉంచారు. తిరుపతి ఎంఎల్‌ఎ భూమన కరుణాకర్‌రెడ్డి తన కుమారునికి ఇవ్వాలని కోరినా, కరుణాకర్‌రెడ్డినే ఈసారి బదిలో దింపనున్నట్లు తెలుస్తోంది. అలాగే టిటిడి ఎంప్లాయీస్‌ ఓట్లు, తిరుపతి అభివృద్ధి ఓట్లు అన్నీ బదలాయింపు జరగాలంటే ఖచ్చితంగా కరుణాకర్‌రెడ్డి ఉంటేనే మంచిదని భావించినట్లు సమాచారం. చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు మోహిత్‌రెడ్డికి ఇవ్వనున్నారు. జగన్‌ ఏర్పాటు చేసిన కోర్‌కమిటీలో విజయసాయిరెడ్డి స్థానంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఇప్పటికే నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుత మంత్రికీ సీటు ఇచ్చేది లేదని చెప్పినట్లు సమాచారం. టిడిపి, జనసేన కూటమిని ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలమున్న వ్యక్తులనే బరిలో దింపాలనే యోచనలో జగన్‌ ఉన్నారని తెలుస్తోంది.