కడప ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల సమరానికి రెండు ప్రధాన పార్టీలు కసరత్తును వేగవంతం చేస్తున్నాయి. నిత్యం జనం మధ్యలో ఉండే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఎన్నికల బరిలో దింపే అభ్యర్థులపైన స్పష్టత కోసం దృష్టి పెట్టాయి. అధికార వైసిపి ఉమ్మడి కడపలో దాదాపు సిట్టింగులకే టికెట్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. వీటిపై ప్రత్యేక కసరత్తు చేయాల్సిన అవసరం కనిపించడంలేదు. ఆ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపిక అనే అంశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏదో ఒక ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండేలా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల ఖరారు తలనొప్పిగా మారింది. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు జమ్మలమడుగు పులివె ందుల మినహా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సింది. వీటిలో కమలాపురం, మైదుకూరు నియోకవర్గాల అభ్యర్ధులపై స్పష్టత ఉన్నా ప్రకటించాల్సి ఉంది. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ఒకరికి మించి ఇద్దరు, ముగ్గురు, నలుగురు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తుండంతో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్నది అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో సర్వేలకు ప్రధానం ఇస్తోంది. లోకేష్ పాదయాత్ర తర్వాత జిల్లాలో తెలుగుదేశం పార్టీ సర్వే బృందాలు పార్టీ పరిస్థితులు, జనంలో తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యం ఏమేరకు పెరిగింది, ఈ అంశాలకు జిల్లాలో ప్రాధాన్యం ఇవ్వాలి, ఇలాంటి అంశాలతో సర్వే చేస్తున్నప్పటికీ ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులపైన కూడా సర్వే బృందాలు నిశిత పరిశీలన కోసం ప్రజాభిప్రాయ సకరణ చేస్తున్నట్లు సమాచారం. ఈ సర్వే ఆధారంగా అధినేత చంద్రబాబుకు జిల్లాలో నాయకులపైన, జిల్లా పట్ల ఉన్న అభిప్రాయాలతో అభ్యర్థుల ఖరారకు తుదిరూపం ఇచ్చి దసరా నాటికి అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం.
ఆ ఆరు చోట్లా పోటా పోటీ
ఉమ్మడి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలైన ప్రొద్దుటూరు, బద్వేలు, కడప, రాజంపేట, ,రైల్వేకోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌లకు పోటా పోటీ ఏర్పడింది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఆరు చోట్ల అభ్యర్థిత్వాలపై సరైన స్పష్టత కనిపించకపోవడంతో టిడిపి కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నారు. ఏ నాయకుడు వద్ద పని చేయాలో తెలియక గ్రూపు రాజకీయాలతో నలిగి పోవాల్సి వస్తోంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం టిడిపికి అంత సులువైన అంశం కాదు. అభ్యర్థిగా అవకాశం దక్కని వారు అసంతృప్తికి గురికావడం, పార్టీకి నష్టం కలిగించే అవకాశాలకు దారితీసే పరిస్థితి ఎదురు కావడం లాంటి పరిణామాలు ఎదురవుతాయన్న ఆందోళన పార్టీలో కనిపిస్తోంది. కాగా రాజంపేటకు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు టికెట్ రేసులో ముందు వరుసలో ఉండగా రాయచోటి చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేత జగన్మోహన్‌రాజు గట్టి ప్రయత్నంతో ఉన్నారు. టికెట్ పై ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. రైల్వేకోడూరులో గత ఎన్నికల్లో పోటీ చేసిన పంతగాని ప్రసాదు ఆశావహుల్లో టిక్కెట్‌పై ఖచ్చితమైన ధీమాను వ్యక్తం చేస్తు న్నారు. ఇక్కడ ప్రధాన నాయకుడైన విశ్వనాథ నాయుడుకు ప్రసాద్‌కు సరైన సంబంధాలు కనిపించడం లేదు. ఇక్కడ నుండి మరో మహిళ అనితా దీప్తి టికెట్ రేసులో ఉన్నారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యూహ కర్త రాబిన్ శర్మ టీం జిల్లాలో పర్యటిస్తున్నట్లు సమాచారం.
ప్రొద్దుటూరులోనూ అదే పరిస్థితి
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టికెట్ తనకే అన్న ధీమాతో ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఉండగా టికెట్టుపై మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కూడా నమ్మకంతో ఉన్నారు. మరో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆశావహుల్లో ఉండగా ఇటీవల కొద్ది రోజులుగా సిఎం సురేష్‌నాయుడు పార్టీలో క్రియాశీలకంగా మారారు. నలుగురిలో ఎవరు అభ్యర్థి అవుతారు అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
కడపలో ఎవరు?
కడప అసెంబ్లీలోనూ ఎక్కువ మంది ఆశావహులున్నారు. అయినా ప్రధానంగా ఇద్దరు పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. వీరిలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మిరెడ్డి కోడలు, కార్పొరేటర్ ఉమాదేవి, టిడిపి పొలి ట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవి లతలున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి అమీర్‌బాబు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో ఎవరిని అభ్య ర్థిగా ఖరారు చేస్తారన్నది ఆ పార్టీలో ఉత్కంఠగా మారింది.
బద్వేలు బరిలో ఎవరికి చోటు
ఎస్‌సి రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గంమైన బద్వేలులో కూడా ఆశావహులసంఖ్య ఎక్కువగా ఉంది. వీరి లో గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ ఓబు లాపురం రాజశేఖర్ మొదటి వరుసలో ఉండగా ఇదే నియో జకవర్గంలోని పోరుమామిళ్ళకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి రోషన్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. వీరు ఇరు వురే కాకుండా కడపకు చెందిన మాజీ గవర్నమెంట్ ప్రాసి క్యూటర్ గుర్రప్ప టికెట్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు.










