- టిడిపి అధినాయకత్వంపై ఎంపి కేశినేని నాని మండిపాటు
ప్రజాశక్తి-విజయవాడ
రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వకుంటే ప్రజల కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా ఏమిటో నిరూపిస్తానని టిడిపి విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్ (నాని) ప్రకటించారు. గురువారం తన కార్యాలయం వద్ద మీడియాతో ఎంపి కేశినేని మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి తరపున ఎంపి టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, గెలిచే సత్తా తనకుందన్నారు. పార్టీ అధినాయకత్వం తనకు ప్రాధాన్యత నివ్వకపోగా, తన పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తనను తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో తనను ఉద్దేశించి 'గొట్టంగాడు, వాణ్ని చెప్పుతీసుకొని కొట్టాలి' అని తన పార్టీలోని కొందరు నాయకులు తిట్టినా కానీ తాను ఏమి అనకుండా, మెదలకుండా ఉన్నానని గుర్తు చేశారు. నియోజకవర్గ స్థాయి ఇన్‌ఛార్జిలు మోనార్క్‌ల్లాగా వ్యవహరించడానికి అదేమన్నా రాజ్యాంగపరమైన పదవి కాదని, పార్టీ నడపడానికి ఇన్‌చార్జి అనే దానిని ఏర్పాటు చేసుకుందే తప్పా..మరొకటి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో రాజులు, సామంతరాజులు అనే వారు ఉండరన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటారన్నారు. అలా తన నియోజకవర్గంలో తనతో పాటు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు, వైసిపి ప్రజాప్రతినిధులు ఉన్నారే తప్పా...''ఇన్‌చార్జీలు గొట్టంగాళ్లు'' అంటూ తీవ్రమైన పదజాలంతో పలు సార్లు ఉచ్చరిస్తూ విలేకరులను రాసుకోండని ఎంపి కేశినేని అనడం గమనార్హం. పార్టీ అధినాయకత్వం తన పట్లా ఎలా వ్యవహరిస్తున్నా...నియోజకవర్గం ప్రజలు తన పట్ల చాలా కంఫర్ట్‌గా ఉన్నారని చెప్పారు. టిడిపితోనే కాకుండా...మిగిలిన పార్టీలన్నింటితోనూ తనకు మంచి సంబంధాలున్నాయన్నారు. ఇటీవల జరిగిన పార్టీ మహానాడు కార్యక్రమానికి తనకు ఆహ్వానం లేదన్నారు. రాష్ట్రంలో ముగ్గురు టిడిపి ఎంపిలు, ఒక రాజ్యసభ సభ్యులుంటే...వీరెవరికీ ప్రాధాన్యతనివ్వకుండా...మహానాడు వేదికపై నుంచి ఎంపి కింజరపు రామ్మోహన్‌నాయుడు ఒక్కడే మాట్లాడతాడన్నారు. అతనికే ప్రాధాన్యతనిచ్చినప్పుడు తన అవసరం లేనప్పుడు తాను వెళ్లాల్సిన పని ఏమిటని విలేకరులను ప్రశ్నించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఇటీవల తన నియోజకవర్గ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి తనకు కనీసంగా ఆహ్వానం కూడా పంపలేదన్నారు. కానీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చన్నాయుడు మాత్రం ఆ కార్యక్రమానికి వచ్చాడన్నారు. పార్టీ నేతలే అలా చేసినప్పుడు ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలను వెళ్తాయన్నారు. పొమ్మనలేక పొగపెట్టినట్లుగా పార్టీ అధినాయకత్వమే అలా వ్యవహరిస్తుంటే తాను ఏమి సమాధానం చెప్పగలనన్నారు. నియోజకవర్గ ప్రజలు తనతోనే ఉన్నారని,'ప్లెబిసైట్' ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి కేసినేని కావాలా... వద్దా అని ప్రజలను కోరితే తేలిపోతోందన్నారు. బెజవాడ...ఇక్కడి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తాను పని చేస్తానని చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు పిఎ ఫోన్ చేసి, ఢిల్లీ రమ్మన్నారని అన్న తరువాత తాను కూడా అదే ఫ్లైట్‌లో వెళ్లాల్సి రావడంతో కలిసి ఢిల్లీ వెళ్లానన్నారు. తాను కలుగు చేసుకొని అధినాయకుడితో మాట్లాడేది ఏమీలేదన్నారు. చంద్రబాబు పిలిచి మాట్లాడితే తాను మాట్లాడతానే తప్ప స్వయంగా వెళ్లి ఇక్కడి పరిణామాలపై మాట్లాడేది ఏమి ఉండబోదన్నారు.










