May 30,2021 13:35

   'బంధాలెప్పుడూ ఊపిరి సలపకుండా చేస్తూనే ఉంటాయి. బంధుత్వాలు అప్పుడప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాయి. అయినా సరే... మనిషెప్పుడూ వాటికి కట్టుబానిసే! ఆకాశం అందినట్లే ఉంటుంది.. అందుకుందామంటే అందనంత దూరం జరిగి నిరాశపరుస్తుంది! జీవితమూ అంతే... మనవనుకున్నవేవీ మనతో ఉండవు! సంబంధం లేనివేవో అల్లుకుపోతుంటాయి! భూమి పుట్టినప్పటి నుంచీ ఇల్లూ, వాకిలి, భర్త, పిల్లలు అనే తపన ఆడవాళ్లకి మొదలైందేమో! గానుగెద్దులా వాటి మధ్యే పెరుగుతూ, వాటి మధ్యే పెరుగుతూ! వాటికోసమే తపిస్తూ, వాటినే జపిస్తూ! వెల్లకిలాపడుకున్న నాకు వేగంగా తిరుగుతున్న ఫ్యాను కనిపించింది. మంచం మీద పడుకుని, కదిలితే అదోరకం చప్పుడు చేస్తూ తిరగాలా వద్దా అనే అనుమానంగా తిరిగే ఫ్యాను వంక చూడ్డం ఈ వారం రోజులుగా అలవాటైపోయింది. ఫ్యాను ఆగకుండా తిరుగుతుంటే హాయిగా ఉంటుంది. పొరపాటున ఆగిందంటే ఎక్కడ మీద పడుతుందోనని భయం! అయినా గుండెల నిండా గాలిని పీల్చుకుని, స్వేచ్ఛగా వదలలేని దుర్దినాల్లో మనుషులంతా జీవచ్ఛవాల్లా బతుకీడ్చుతుంటే, తను భయపడడంలో అర్థం ఏముంది? భౌతికదూరం పేరుతో మనిషికి మనిషే భయపడి, పక్కకి జరగడం ఏ విపరీత పరిణామాలకి దారితీస్తుందో అంచనా వేసేదెవరు? పండగలు, పబ్బాలు, చావులు, పెళ్లిళ్లు... ఒకటా రెండా.. మనిషిని మనిషితో కలపడానికి సంఘం ఎన్ని సందర్భాలను సృష్టించింది? గర్భగుడిలో నుంచి బయటికి రాని దేవుడిలా ఇప్పుడు మనిషి కూడా ఇంట్లోనే మగ్గిపోవాలి. మాటామంతీ లేని బండరాయిలా మౌనంగానే బతుకీడ్చాలి.
   పక్కకి చూశాను. నాలాగా ఎందరో? కదలని శవాల్లా పడుకుని, పైకి చూస్తున్నారు. కదిలితే గాలి చుట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తుందని భయం. లేచి నడిస్తే ధూళి అంటుకుంటుందని ఆందోళన. పలకరిస్తే మాటేసిన శత్రువెవరో మనసును మెత్తగా కోసి, మట్టిలో కలిపేస్తారని కంగారు. ఎవరికి వాళ్ళు.. ఎవరికి ఎవరూకానట్లు.. తమకెవరూ లేనట్లు.. తమకోసం ఎవరూ రారన్నట్లు.. అయోమయంగా అదోరకంగా.. దిక్కుల్ని శూన్యంలో ఒంపి, దిగులుగా చూస్తున్నారు.

                                                                         ***

'ఎక్కడ చచ్చావే? అరగంట నుంచీ అరుస్తున్నా, ఒక్క కాఫీ చుక్క నా గొంతులో పోసిన పాపాన పోలేదు. నేననేదాన్ని ఒకదాన్ని చచ్చానన్న ఇంగితం లేదు. ఎంతసేపూ వంటింటి గోడలకు బూజులా వేలాడకపోతే నా ముఖాన కాసిని కాఫీనీళ్ళు కొట్టకూడదూ? అయినా నిన్నని ఏం లాభంలే? నా బతుకే అంత... ఏ జన్మలో చేసుకున్న పాపమో మెడకు చుట్టుకుని ఇప్పుడేడిపిస్తుంది..' కాఫీ తాగడం కొంచెం ఆలస్యమైతే అత్తగారి సుప్రభాతం ఎడతెగని వానచినుకుల్లా వినిపిస్తూనే ఉంటుంది. మామగారు పోయాక ఒక్కతే ఊళ్ళో ఏముంటుందని, ఇంటికి తీసుకొచ్చి, మాతోపాటే ఉంచారు. వచ్చిన కొత్తలో మాటామంతీ బాగానే ఉండేది. కొన్నాళ్లయ్యాక నేనేదో తెగ సుఖపడుతున్నానని అనుమానం వచ్చింది. ఇక అప్పటినుంచీ అత్తగారిలోని అసలు మనిషి నిద్ర లేచింది. ఆరళ్లు కాదుగానీ అదోరకం ఛాదస్తం. చప్పుడు వచ్చేలా నడవకూడదు, నలుగురున్నప్పుడు నవ్వకూడదు. గోడ మీద బల్లిలా ఆకారానికి కనిపించాలిగానీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. ఆవిడ అసూయగానో.. అధికారంతోనో అన్నా.. నాకు మాత్రం హాయిగానే అనిపించేది. అయినా.. శత్రువును మించిన మిత్రులెవరుంటారు? ఇప్పుడు అక్కడ లేనుగా.. పాపం.. నన్ను అస్తమానం తల్చుకుంటూనే ఉండి ఉంటుంది! నేను కనబడకపోతే ఆ కోపమంతా ఏ పిల్లి మీదో, కుక్క మీదో పెట్టి.. తిడుతూనే ఉంటుంది. కనీసం నన్ను తిట్టడానికైనా నేను త్వరగా వస్తే బాగుండని కోరుకుంటూనే ఉంటుందేమో! మనుషులు ఎదురుగా ఉంటే కోపగించుకోవడం, దూరమైనప్పుడు వాళ్లను తల్చుకుని, చాటుగా కళ్ళు తుడుచుకోవడం మనిషి బలహీనత కదూ!

                                                                             ***

'డాక్టర్‌.. ఈమెకు గాలి తీసుకోవడం కష్టంగా ఉంది. ఊరికే ఆయాసపడుతోంది' అన్న సిస్టర్‌ కేకతో అందరూ అలెర్ట్‌ అయ్యారు. నేనూ పక్కకి చూశాను. ఆయాసంతో ఎన్నాళ్లనుంచి బాధపడుతోందో.. బెడ్‌ మీద ఎగిరెగిరి పడుతోంది. ఎముకల గూడులా ఉంది. దగ్గి దగ్గి పేగులు ఆర్చుకుపోయినట్లుగా, ఎముకలన్నీ తమ తమ స్థానం తప్పి, ఒకేచోట పోగుపడినట్లుగా కనిపిస్తుంది. నోరు తెరిచినప్పుడు ఊడిపోయిన పళ్లల్లో నుంచి కొంచెం గాలి లోపలికి వెళ్లడం వల్ల బతికుందేమో! గాలి ఎక్కువైనా కష్టమే.. తక్కువైనా కష్టమే. మరణమెప్పుడూ మన పక్కనే ఉండి జోకొడుతూ ఉంటుందేమో !
'ఇంక కష్టం... ఈమెను చూడడానికి ఎవరైనా వచ్చారా?' అడుగుతున్నారు డాక్టర్‌.
లేదన్నట్లుగా తలూపింది సిస్టర్‌.
'అంబులెన్సుకి కబురుచేయండి' డాక్టర్‌ వడివడిగా వెళ్ళిపోయారు.
ఆమె వైపు చూశాను. ఎగిరెగిరిపడిన గుండె ఒక్కక్షణం విశ్రాంతి తీసుకోవడానికి ఆగినట్లుగా ఉంది ఆమె దేహం. సీలింగ్‌ వైపు చూస్తూనే ప్రాణం విడిచినట్లుంది. మరణం ఎంత శక్తివంతమైంది.. వచ్చిన పని అయిపోయినట్లుగా ఆత్మీయులందరికీ వీడ్కోలు చెప్పేటట్లుగా చేస్తుంది. మళ్ళీ తిరిగిరాని ఏవో లోకాలకు తీసుకుపోతుంది! ఆమెను తీసుకువెళ్తుంటే అందరూ భయంభయంగా చూడసాగారు. మరణం సహజంగా వస్తే 'అయ్యో' అనుకుంటారు. శరీరాన్ని ఇంత భయంకరంగా పీల్చి పిప్పిచేసి తీసుకెళ్తే 'అమ్మో' అనుకుంటారు. ఎలా అనుకున్నా చావు మాత్రం తన పని తాను చేసుకుపోతుంది! అయినా ఆరోగ్యవంతుల్నే అమాంతం మింగేసి లాక్కెళ్తున్న చావు, ఆయాసం వాళ్లని ఎలా వదిలిపెడుతుంది?

                                                                          ***

ఆయన ఎలా ఉన్నారో? ఆయనకి భార్యంటే... పగలంతా యంత్రం, రాత్రికి సమ్మోహన మంత్రం. వేళకి అన్నీ సమకూర్చితే ''ఉత్తమ ఇల్లాలిని''. నలతగా ఉండి, కొంచెం తేడా వస్తే ''ఇంటికి దాపురించిన శనిని''. ఆఫీసులు, ఫైళ్లు, స్నేహితులతో కబుర్లు.. ఏదీ లోటులేకుండా అన్నీ వేళకి జరిగిపోవాలి.
'ఎవర్నీ తాకకుండా హోమ్‌ క్వారంటైన్లోనే ఉంటానండీ.. పిల్లల్ని విడిచిపెట్టి ఉండలేను' అంటే 'మమ్మల్ని కూడా చంపేస్తావా?' అంటూ నావైపు కోపంగా చూశారు.
ఈ వారం రోజుల్లో కనీసం కాఫీ అవసరమైనప్పుడైనా నన్ను తల్చుకుంటున్నారో లేదో? కావలసిన వస్తువులు దొరకనప్పుడైనా నన్ను ''యామినీ... యామినీ'' అని పిలుస్తున్నారో లేదో? ఒంటినిండా నగలక్కర్లేదు, నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడితే ఒంటరితనమనే ఎడారిలో వాన కురిసినట్లు ఉండదూ? కొంతమంది అంతేనేమో.. మూర్ఖంగా పుట్టి, మూర్ఖంగా పెరిగి, మూర్ఖంగానే కనుమరుగవుతారేమో!

                                                                           ***

'ఏమ్మా... జ్వరము, దగ్గు, జలుబులాంటివేమీ లేవుగా? ఎవరితోనూ కలవకు, మాస్కు తీయకు. ఇంకో వారమైతే అప్పటి పరిస్థితిని బట్టి ఇంటికి వెళ్ళొచ్చు' చెప్తున్న సిస్టర్‌ వంక ఆత్మీయంగా చూశాను.
ఏ తల్లి కన్నబిడ్డో... రోజుకు మూడుపూటలా మనసారా పలకరిస్తుంది. ఆరోగ్యం ఎలా ఉందని, తిన్నావా లేదా అని అడిగి తెలుసుకుంటుంది. అవసరమైన మందులిస్తుంది, ఎలా వాడాలో చెప్తుంది. మనిషి జీవితం అంతే.. మనవాళ్ళు అనుకున్నవాళ్ళు మనతో ఉండరు. ఎవర్ని తిరస్కరిస్తామో, ఎవర్ని చులకనగా చూస్తామో వాళ్ళే మనతో ఉంటారు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త దగ్గరలేడు.. ఆదరిస్తానని మాటిచ్చిన అత్తలేదు.. కడుపున పుట్టిన పిల్లల్లేరు... కానీ ఈవిడ మాత్రం పోతున్న ప్రాణాన్ని వెనక్కి లాగడానికి వచ్చిన దేవతలా కళ్ల ముందు తిరుగుతుంటుంది. డ్యూటీలో భాగమే అయినా ఆవిడ ఎంతో ప్రేమగా, ఓపికగా, ఆప్యాయంగా... పక్కన నుంచుని పలకరిస్తుంటే ప్రాణం తెప్పరిల్లినట్లుగా, బండలు మోసీ మోసీ అలసిపోయిన గుండెలో ఏవో అనురాగ పులకలు మొలుస్తున్నట్లుగా, నరికేసిన చెట్టుమొదలు నుంచి కొత్తగా చిగుర్లు పుడుతున్నట్లుగా అనిపిస్తుంటుంది! నేను కనబడకపోతే ఒక్క నిముషం సరిగా ఉండరు పిల్లలు. ఇద్దరికీ ఒకే వస్తువు కావాలి. ఒకరి మీదొకరు చాడీలు చెప్పుకోవాలి. ఆటల పేరుతో ఇంటిని నానా బీభత్సం చేసేయాలి. అప్పటివరకూ స్నేహితుల్లా ఆడుకుని, ఆ మరుక్షణమే ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకునే శత్రువుల్లా మారిపోతుంటారు. పిల్లలంటే అంతేనేమో.. వంటింట్లో పట్టిన చెమటచుక్కల్లా కొన్నిసార్లు చికాకుగా అనిపించినా, ఫ్యాను కింద కూర్చున్నప్పుడు సేద తీరుతున్నట్లు హాయిగా అనిస్తుంటుంది. 'అమ్మా బిస్కెట్టుందా? అమ్మా చాక్లెట్టుందా?' అంటూ కొంగుచాటునే తిరుగుతూ ఒక్కోసారి విసుగునూ, కోపాన్ని తెప్పించినా, అప్పటికప్పుడే ఏవో తెలిసీతెలియని మాటలు మాట్లాడి, పెదాలపై నవ్వులు పూయిస్తుంటారు.
   ఇంటిపనులతో, పిల్లల సముదాయింపు లతో రోజంతా ఏదో తెలియని చికాకుతో గడుస్తుంది. ఎన్నోసార్లు నాలో నేనే మదనపడేదాన్ని. ఇంటి నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపించేది. ఎవరికీ కనబడకుండా దాక్కోవాలనిపించేది. ఇల్లనే బందిఖానా నుంచి స్వేచ్ఛ దొరికే ప్రాంతానికి, బంధనాలు లేని దేశానికి, ఆంక్షలు లేని కొత్తలోకానికి వెళ్లిపోవాలనిపించేది. నా పిచ్చిగానీ ఆడదై పుట్టాక తీయని సంకెళ్ళుగా పెనవేసుకునే బంధాలను, బాధ్యతలను తప్పించుకుపోవడం ఎవరికి సాధ్యం? పెళ్లితోనూ, పిల్లలతోనూ ముడిపడిన బతుకును విడిచిపెట్టి ఎంతదూరం పారిపోగలం?
   ఇల్లొక అందమైన జైలు. తలుపులు, గుమ్మాలు... అడుగు బయటపెట్టకుండా బంధించే ఉంచిన తీయని సంకెళ్ళు. ఎంత తిరిగినా ఇంట్లోనే తిరగాలి.. ఎంత ఆలోచించినా ఇంటివాళ్ల గురించే ఆలోచించాలి.. ఆలోచించేకొద్దీ గుండె ఇరుకుగా అవుతోంది. పరిచయం లేనివారెవరో గుండెను గుప్పెట్లోకి తీసుకుని, గట్టిగా నొక్కి వదులుతున్నట్లుగా ఉంది. ఊపిరాడనట్లు, బిగబట్టినట్లు నొప్పి సుడులు తిరుగుతోంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు. నేనెక్కడికో జారిపోతున్నట్లు, నన్నెవరో తాడుకట్టి లాక్కుపోతున్నట్లు అనిపించసాగింది. రెప్పలు భారంగా మూతపడుతున్నాయి.
   'ఏమేవ్‌ ఎక్కడ చచ్చావ్‌', 'యామినీ నా ల్యాప్‌టాప్‌ ఎక్కడ పెట్టావ్‌', 'అమ్మా ఆకలవుతోంది' ఏవో పిలుపులు దూరం నుంచీ లీలగా వినిపిస్తున్నాయి. కళ్ళు మూతపడ్డాయి. రెండు కన్నీటిచుక్కలు చెంపలపై నిశ్శబ్దంగా జారి, అంటుకుపోయాయి.

డా. జడా సుబ్బారావు
- 98490 31587