ప్రజాశక్తి - ఆదోని
మండలంలోని వివిధ గ్రామాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అడగంటిపోవడంతో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొందని, దీనికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు, మండల కార్యదర్శి కె.లింగన్న డిమాండ్ చేశారు. ఆదివారం బి.వీరారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రధానంగా పెద్దహరివాణం, సంతేకుడ్లూరు, మదిరే, హనవాళ్ గ్రామాలలో నిర్మించిన ఎస్‌ఎస్ ట్యాంకులు ఎండిపోయాయని తెలిపారు. అలాగే కుప్పగల్లు, నెమలికల్లు ఎస్‌ఎస్ ట్యాంకులు అడుగంటిపోయాయని చెప్పారు. ప్రజలకు తీవ్ర నీటి కష్టాలు ప్రారంభమయ్యాయని, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ గ్రామాల్లో ఉన్న బోరుబావులు లేదా ప్రయివేట్ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రత్యేకంగా ట్యాంకర్లు ఏర్పాటు చేసి తాగునీటి ఎద్దడి నివారించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో సచివాలయం ముందు ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం మండల నాయకులు శేఖర్, పాండవగల్లు, గణేకల్లు, కుప్పగల్లు, కొత్తూరు, బసరుకోడు, సంతేకుడ్లూరు, హనవాళ్ గ్రామాల శాఖ కార్యదర్శులు విరుపాక్షి, పాండురంగ, హనీఫ్ బాష, రంగనాథ్, దస్తగిరి బాషా, మునిస్వామి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశులు










