ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా సహకార సంఘాలలో పని చేస్తున్న చేనేత కార్మికులకు పుర్తి కాలం పని దొరకకపోవటంతో నెలకు రూ.6 వేల నుండి రూ.9 వేల వరకు వేతనం కోల్పోతున్నారు. ప్రైవేటు రంగం లోని చేనేత కార్మికులది కూడా ఇదే పరిస్థితి. ఇక షెడ్డు చేనేత కార్మికుల పరిస్థితి దీనాతిదీనంగా ఉన్నది. ప్రభుత్వం నుండి రూ.24,000 సహాయం అందకపోవడం, పూర్తి కాలం పని దొరకక పోవడం వల్ల అర్థాకలితో పస్తులతో, గడపవలసిన దుస్థితి ఏర్పడింది.
చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రైవేటు రంగం లోని చేనేత కార్మికులకు పూర్తి కాలం పని దొరకడం లేదు. ప్రైవేటు రంగంలో వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. చేనేతకు రిజర్వు చేసిన రకాలను పవర్ మగ్గాల రంగంలో భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గత సంవత్సర కాలంలో లాక్‌డౌన్ కారణంగా వస్త్ర వ్యాపారం బాగా తగ్గింది. ఈ పరిస్థితులలో పవర్ మగ్గాల రంగంలో తయారైన వస్త్రాలు అతి తక్కువ ధరలకు యథేచ్ఛగా మార్కెట్‌లోకి రావడంతో చేనేత పరిశ్రమ పరిస్థితి మరింత దిగజారింది.
గత రెండు సంవత్సరాల కాలంలో నిత్యవసర సరుకుల ధరలు 50 శాతం పైగా పెరిగాయి. ఈ పరిస్థితులలో వస్త్ర మార్కెట్ సంక్షోభ స్థితిని ఆసరా చేసుకుని మాస్టర్ వీవర్లు చేనేత కార్మికుల వేతనాలను తగ్గిస్తున్నారు. పూర్తిగా పని దొరకక తగ్గిన వేతనాలతో చేనేత కార్మికులు పస్తులతో గడుపుతున్నారు. ఇదిలా ఉండగా చేనేత సహకార రంగం మూతపడే స్థితికి చేరింది. మూడు సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు విడుదల చేయకపోవడంతో అవి నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. దాంతో సభ్య చేనేత కార్మికులకు సగం పని మాత్రమే కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ప్రతి చేనేత కార్మికుడు నెలకు 5 పడుగులు నేత నేస్తాడు. కాగా గత ఐదు నెలలుగా సభ్యులకు 2 లేక 3 పడుగుల వరకు మాత్రమే పని కల్పిస్తున్నారు. ఈ పరిస్థితులలో సహకార సంఘాలలోని చేనేత కార్మికులు సైతం పస్తులతో గడపవలసిన దుస్థితి ఏర్పడింది.
గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి చేనేత సహకార సంఘాలకు రావలసిన నూలు సబ్సిడి, రిబేటు బకాయిలు, చేనేత కార్మికులకు రావలసిన త్రిఫ్ట్ ఫండ్ కాంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 40 శాతం నూలు సబ్సిడీలో 30 శాతం చేనేత కార్మికులకు అందించాల్సి ఉంది. దీనివల్ల ప్రతి చేనేత కార్మికునికి సంవత్సరానికి కనీసం రూ. 25,000 అందుతుంది. ఈ మూడు సంవత్సరాల కాలంలో ఈ మొత్తం చేనేత కార్మికులకు అందలేదు. రిబేటు బకాయి విడుదల చేస్తే సహకార సంఘాలకు అప్పుపై వడ్డీ భారం తగ్గి సంఘాలు లాభాల బాటలో నడిచేవి. ఆ లాభాలను కూడా చేనేత కార్మికులకు చేసిన పని దామాషాలో పంపిణీ చేసేవారు. గత రెండు సంవత్సరాలుగా ఈ పరిస్థితి లేదు.
మొత్తంగా నాబార్డు నుండి చేనేత సహకార సంఘాలకు ఇచ్చిన రుణాల మొత్తంతో సమానంగా ప్రభుత్వం నుండి సహకార సంఘాలకు రావలసిన నూలు సబ్సిడీ, రిబేటు బకాయిల రూపంలో అందవలసి ఉంది. ప్రభుత్వం ఈ నిధులన్నిటిని విడుదల చేస్తే చేనేత సంఘాలు చేనేత కార్మికులకు పూర్తి కాలం పని ఇవ్వగలుగుతాయి. సంఘాలపై వడ్డీ భారం తగ్గుతుంది. తద్వారా సంఘాలకు లాభాలు సమకూరి అందులో చేనేత కార్మికులకు వాటా అందుతుంది. ఈ విధంగా సహకార సంఘం లోని చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ. 50,000 నుండి రూ. 70,000 వరకు ఆదాయం లభించేది. ఈ నిధుల విడుదలను ప్రభుత్వం ఆపేసి చేనేత కార్మికులకు సంవత్సరానికి రూ.24,000 ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. మరో పక్క అత్యల్ప వేతనాలు పొందుతున్న షెడ్డు చేనేత కార్మికులకు ఈ రూ.24000 సహాయం కూడా అందించడం లేదు.
సహకార సంఘాల దగ్గర కోట్లాది రూపాయల విలువైన వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. వాస్తవానికి సహకార సంఘాల ఉత్పత్తులన్నిటినీ ఆప్కో ద్వారా కొనుగోలు చేయించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. గత రెండు సంవత్సరాల కాలంలో ఆప్కో కొద్దిపాటి వస్త్రాలను మాత్రమే కొనుగోలు చేసింది. రిబేటు లేకపోవడంతో సంఘాలు బయట మార్కెట్‌లో వస్త్ర నిల్వలను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా చేనేత సహకార రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
చేనేత మంత్రివర్యులను పలుమార్లు కలిసి ఈ విషయాలను విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. గతంలోనూ ఇదే పరిస్థితి. 1995 నుండి 2004 వరకు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రభుత్వం 9 సంవత్సరాల పాటు రిబేటు బకాయిలు, నూలు సబ్సిడీ, త్రిఫ్ట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ నిలిపివేసింది. 2004 సంవత్సరంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే సి.పి.ఎమ్ పొలిట్‌బ్యూరో సభ్యులు కొరటాల సత్యనారాయణ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘ నాయకులు ఆయనను కలిసి పరిస్థితిని వివరించారు. తెలుగుదేశం పాలనలో 70 శాతం సహకార సంఘాలు మూతపడిన విషయాన్ని, ఆప్కో సంస్థ దీన స్థితికి చేరిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి అప్పటి ఆర్థికమంత్రి కె.రోశయ్య అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికసంఘం ఇచ్చిన మెమోరాండం ప్రాతిపదికన విచారణ చేసి పరిష్కార మార్గం సూచించాల్సిందిగా ఆదేశించారు.
రోశయ్య కమిటీ సిఫార్సులను పరిశీలించిన ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి...సహకార సంఘాలకు రావలసిన నూలు సబ్సిడీకి రిబేటు బకాయిలు, చేనేత కార్మికులకు రావలసిన త్రిఫ్ట్‌ఫండ్ బకాయిలు వెంటనే విడుదల చేయించారు. అదే సమయంలో రూ. 50 కోట్ల ఆర్థిక సహాయం అందించి ప్రాథమిక సంఘాల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను కొనుగోలు చేయించారు. తద్వారా చేనేత సహకార సంఘాలను పునరుద్ధరించి చేనేత కార్మికులకు పూర్తి పని కల్పించడానికి తోడ్పడ్డారు. రాజన్న బాటలో పాలన సాగిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేనేత రంగాన్ని ఆదుకునేలా చర్యలు చేపట్టాలని చేనేత కార్మికులు కోరుకుంటున్నారు.
చేనేత కార్మికులు తమ వృత్తి ద్వారా పొందుతున్న ఆదాయాలు కుటుంబ నిర్వహణకు సరిపోని పరిస్థితులలో ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రూ.24000 కొంత వెసులుబాటు కల్పిస్తుంది. అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా సహకార సంఘాలలో పని చేస్తున్న చేనేత కార్మికులకు పుర్తి కాలం పని దొరకకపోవటంతో నెలకు రూ.6 వేల నుండి రూ.9 వేల వరకు వేతనం కోల్పోతున్నారు. ప్రైవేటు రంగం లోని చేనేత కార్మికులది కూడా ఇదే పరిస్థితి. ఇక షెడ్డు చేనేత కార్మికుల పరిస్థితి దీనాతిదీనంగా ఉన్నది. ప్రభుత్వం నుండి రూ.24,000 సహాయం అందకపోవడం, పూర్తి కాలం పని దొరకక పోవడం వల్ల అర్థాకలితో, పస్తులతో గడపవలసిన దుస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితులలో సహకార సంఘాలకు రావలసిన బకాయిలన్నిటిని వెంటనే విడుదల చేయాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. సహకార సంఘాల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ప్రభుత్వం ఆప్కో ద్వారా కొనుగోలు చేయించి వెంటనే సొమ్ము చెల్లించాలని కోరుతున్నారు. షెడ్డు కార్మికులందరికి రూ. 24,000 సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. 2008లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నాటి నిత్యవసర సరుకుల ధరల ప్రాతిపదికన చేనేత కార్మికుల వేతనాలు పెంపు చేయించారు. ఈ 13 సంవత్సరాల కాలంలో నిత్యవసర సరుకుల ధరలు 70 శాతం వరకు పెరిగాయి. ఈ పరిస్థితిలో చేనేత కార్మికుల వేతనాలను నేటి ధరల ప్రాతిపదికన పెంచి అమలు చేయించాల్సిందిగా చేనేత కార్మికులు కోరుకుంటున్నారు.
సజ్జా నాగేశ్వరరావు











