ప్రజాశక్తి -ములగాడ : అలహాబాద్ జైల్లో ఉన్న తీస్తాసెతల్వాద్‌కు మద్దతుగా ఐద్వా మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యాన శనివారం పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా మల్కాపురం జోన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మమత, ఆర్.విమల మాట్లాడుతూ, 2002 గుజరాత్ అల్లర్లకు వ్యతిరేకంగా తీస్తా సెతల్వాద్ అవిశ్రాంత పోరాటం చేశారన్నారు. మత ఘర్షణలో 120మందిపై కేసులు పెట్టించడంతో సహించలేని బిజెపి ఆమెను జైల్లో పెట్టి నిర్బంధించిందని విమర్శించారు. హత్యలు, మారణకాండ, అత్యాచారాలు చేసిన వారికి బిజెపి అండగా నిలుస్తోందని, ఎదిరించి అడిగిన జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, కవులపై అక్రమకేసులు పెట్టి విచారణ పేరుతో ఏళ్ళ తరబడి జైల్లో పెడుతున్నారని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు, మారణకాండ చేసిన బిజెపి వారిని జైలు నుంచి విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జయలక్ష్మి, రాజేశ్వరి, వరలక్ష్మి, నిర్మల తదితర్లు పాల్గొన్నారు.










