తీర్మాణాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆందోళన ఉదృతం చేస్తాం..
గిరిజనుల సత్తా చాటుతాం..
బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానంపై గిరిజనులు ఆగ్రహం
ఎస్టీ జాబితాలో ఇతర కులాల్ని చేర్చే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి..
నంద్యాలలో గిరిజనులు భారీ ఎత్తున ర్యాలీ, రాస్తారోకో
వైసిపి ఎస్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి.... గిరిజన సంఘాల డిమాండ్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం బోయ, వాల్మీకులు, బెంతు ఓరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేలా శాసనసభలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో శనివారం గిరిజన ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ నేతృత్వంలో మున్సిపల్ ఆఫీస్ నుండి శ్రీనివాస సెంటర్ వరకు వేలాదిమంది గిరిజనులు పాల్గొని ర్యాలీ రాస్తారోకోలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై గిరిజన సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇది కేవలం రాజకీయ స్వార్థము, ఓటు బ్యాంకు కోసమే చేసిన తీర్మానమేనని వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస సెంటర్లో గంటసేపు రాస్తారోకో నిర్వహించారు .ఈ సందర్భంగా గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రవి నాయక్, ఓంకార్ ఎరుకుల పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రుడు ఇతర సంఘాల నాయకులు మాట్లాడుతూ అది గిరిజనుల గొంతు కోసే తీర్మానమని, అది రాజ్యాంగ విరుద్ధమని, రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం గిరిజన జాతిని అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఫైర్ అయ్యారు గిరిజనుల ఇంత అన్యాయం జరుగుతున్న అధికార పార్టీలోని గెలుపొందిన ఎస్టి ఎమ్మెల్యేలు ఎందుకు నోరుమెదపడం లేదని మండిపడ్డారు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని లేకుంటే గిరిజన ద్రోహులుగా మిగిలిపోతారని ఎంపీ, ఎమ్మెల్యేలను హెచ్చరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో చేసిన తీర్మానం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అడవి తల్లినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయాలు తీసుకొని వారిని రోడ్డుపాలు చేయడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. అభివృద్ధి చెందిన బిసి కులాలను ఎస్టి జాబితాలో చేరిస్తే గిరిజనుల జీవన విధానంపై ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నవారు అవుతారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు చేసిన పనే వైసిపి ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తుందని వాపోయారు.మన్యం జిల్లాలో చేసిన బందును స్ఫూర్తిగా తీసుకొని గిరిజనులంతా ఏకమై రాయలసీమ బందుకు త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నంద్యాలలో జరిగిన ర్యాలీ రాస్తారోకోకు అత్యధికంగా గిరిజనులు మహిళలు యువకులు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. శాసనసభలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే గిరిజనులంతా ఏకమై వైసీపీ ప్రభుత్వాన్ని ఓట్ బ్యాంకుతో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు. ర్యాలీలో జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, మల్లేష్ నాయక్, ఎన్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఓంకార్, ఎరుకుల పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి రామచంద్రుడు, ఉపాధ్యక్షుడు నాగార్జున, తిరుపాలు, సుంకన్న, ఎన్టీఎఫ్ సుంకన్న, మహిళ విభాగం జిపిఎస్ అధ్యక్షురాలు ఉషారాణి, లక్ష్మీబాయి, ఆల్ ఇండియా బంజారా సంఘం నాగేష్ నాయక్, జిపిఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామచంద్రనాయక్, రామంజి, వెంకటేష్ నాయక్, గుంతకందాల వెంకటేష్ నాయక్, ఎరుకల సంఘం సిరివెళ్ల మండలం శ్రీశైలం ఇన్చార్జి రామ నాయక్, వెలుగోడు మండల అధ్యక్షుడు స్వామి నాయక్, సచిన్ నాయక్, విక్రమ్ నాయక్ బాలా నాయక్, నందమూరి నగర్ బాలు నాయక్, ఐలూరు మెట్ట గిరిజనులు, వైఎస్ఆర్సిపి ఎస్టీ సెల్ నీలా నాయక్, అశోక్ నాయక్ సురేష్ నాయక్, ఈశ్వర్, సుంకన్న, అన్ని సంఘాల గిరిజనులు పాల్గొన్నారు










