Oct 10,2022 23:34

 కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మత్స్యకారులు

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక బోయవీధిని ఆనుకుని సముద్ర తీరం కోతకు గురవ్వడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం మత్స్యకార నాయకులు గంటా నూకరాజుతో కలిసి బోయవీధి మత్స్యకారులు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా నూకరాజు మాట్లాడుతూ, బోయవీధి సముద్ర తీరం వెంబడి రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని స్థానిక మత్స్యకారులు కొంతకాలంగా కో ుతున్నప్పటికీ ఎటువంటి స్పందన, చర్యలు లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బోయవీధిలో నివాసాలకు సుమారు 200 మీటర్లు దూరంలో ఉండే సముద్రం, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా ముందుకు రావడంతో మత్స్యకారులు ఆందోళనకు గురౌతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు నూకరాజు ఆధ్వర్యంలో జోనల్‌ కమిషనర్‌ ఎస్‌. వెంకటరమణకు మత్స్యకారులు వినతిపత్రం అందజేశారు.