ప్రజాశక్తి-ఎస్.రాయవరం: మండలంలోని తీరప్రాంత గ్రామమైన రేవుపోలవరంకు భక్తులు పోటెత్తారు. నక్కపల్లి, యలమంచిలి, చోడవరం, నర్సీపట్నం, మాకవరపాలెం మండలాల నుండే కాక ఏజెన్సీ ప్రాంతాల నుండి భక్తులు పుణ్యాస్నానాలు ఆచరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నక్కపల్లి సిఐ నారాయణరావు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం నర్సీపట్నం ఆర్టీసి అధికారులు బస్సులను ఏర్పాటు చేశారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థలు సేవాకార్యక్రమాలు చేపట్టాయి.
నక్కపల్లి:మండలంలోని బోయపాడు, దొండవాక సముద్ర తీరాల్లో జనసందోహం కనిపించింది. ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సముద్ర తీరాల్లో స్నానాలు ఆచరించారు. పలు ప్రాంతాల నుండి జనం తరలి రావడంతో సముద్ర తీరం జనం రద్దీతో కిటకిటలాడింది. మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర తీరాల్లో చిరు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకుని, వ్యాపారాలు సాగించారు.
పాయకరావుపేట:మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని మండలంలోని పెంటకోట తీర ప్రాంతంలో అధిక సంఖ్యలోని భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా చిక్కాల యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేపట్టారు.










