పక్షి ముక్కును పోలీ ఉండే విదేశీ పువ్వు బర్డ్ ఆఫ్ ప్యారడైజ్‌కు ఆ పేరెలా వచ్చిందో తెలుసా ? అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ.. మిరాకిల్ ఫ్రూట్ ఒక్క పండు తింటే చాలు గంటలోపు మరే చేదు కాయలు తిన్నా తేనెలా మధురంగా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ రుచి దానికి ఎలా వచ్చిందో? ప్లాస్టిక్ ఆర్నమెంట్స్‌ను తలపించే హెల్కొనియా ఎన్ని రకాల్లో లభిస్తుందో? మరెన్నో విషయాలను ఈ వారం 'విరితోట'లో విహరించి తెలుసుకుందాం పదండి..!
బర్డ్ ఆఫ్ పారడైజ్
పూలమొక్కల ప్రపంచంలో మరో అద్భుతం బర్డ్ ఆఫ్ పారడైజ్. ఈ మొక్క ఐదారడుగులు పెరిగి, పువ్వులు పూస్తుంది. మొక్క ఆకులు చిన్ని చిన్ని అరటాకులను పోలి ఉంటాయి. వాటి ఆకుల మధ్య నుంచి సన్నని దూటలాంటి కాండం పెరిగి, చివరన విభిన్న రంగుల కొలువులో పూరేకలు విచ్చుకుంటాయి. ముదురునీలం, ఎరుపు, పసుపు, గోధుమ రంగుల కలబోతతో దళసరి పూరేకలు ఉంటాయి. ఉష్ణమండలపు పక్షుల ముక్కులను పోలి ఈ పూరేకలు ఉండటంతో 'బర్డ్ ఆఫ్ పారడైజ్' అని పిలుస్తారు. ఇవి వర్షాకాలంలో వికసిస్తాయి. స్ట్రెలిటీజయా రేజీనా, బర్డ్ ఆఫ్ క్రేన్ అనీ పిలుస్తారు. ఇది విదేశీ మొక్క. దీనిని కుండీల్లోనూ పెంచుకోవచ్చు.
అద్భుతం.. మిరాకిల్ ఫ్రూట్
మిరాకిల్ ఫ్రూట్ నిజంగా అద్భుతమే. ముందు ఈ ఫ్రూట్ తిని, తరువాత కాకరకాయ తిన్నా తియ్యగా మధురంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్రూట్ తిన్న గంట వరకూ ఏమితిన్నా తియ్యగా ఉంటుంది. పండులో ఉండే మెరాక్యులన్ పదార్థం వల్ల ఇలా జరుగుతుంది. సిన్సెపాలమ్ డల్సిఫికం దీని శాస్త్రీయనామం. పండ్లు ఈతకాయలు పరిమాణంలో ఉండీ, ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. మొక్కలు ఐదారడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. చెట్టు బుస్సీగా ఉంటుంది. కుండీల్లోనూ, నేల మీదా వీటిని పెంచుకోవచ్చు. మ్యాజిక్ ఫ్రూట్ (మిరాకిల్ ఫ్రూట్) ఉష్ణమండల పశ్చిమ ఆఫ్రికాలో ఘనా-కాంగో వంటి దేశాల్లో ఆదిమవాసులు ఈ అద్భుత బెర్రీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మధుమేహం వ్యాధిగ్రస్తులు షుగర్‌కి ప్రత్యామ్నాయంగా విదేశాల్లో మిరాకిల్ పండ్లు ఉపయోగిస్తారు. మనదేశంలో వీటి కాపు తక్కువగా ఉంటుంది. వీటి ధరా ప్రియమే.
హెల్కొనియా ఓ ఆభరణం !
ఇవి ఆభరణాల్లా వింతైన ఆకృతుల్లో పువ్వులు పూసే అపురూప మొక్కలు. వీటి పువ్వులు అచ్చంగా ప్లాస్టిక్ ఆర్నమెంట్స్‌లా ఉంటాయి. ఆకులు చిన్నసైజు అరటాకులు మాదిరిగా ఉంటాయి. ఎరుపు, పసుపు, గోధుమ, తెలుపు, నారింజ రంగుల కలబోతతో పక్షుల ముక్కుల్లాంటి గొలుసుకట్టు పువ్వులు వేలాడుతూ అందంగా ఉంటాయి. ఒక్కోపువ్వు మూడు నెలల వరకూ ఉంటుంది. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతుంది. నిజానికి ఇది అమెరికా ఉష్ణమండల అడవిజాతి మొక్క. ప్రపంచంలో ఇప్పటివరకూ ఈ జాతికి చెందిన 194 రకాల మొక్కలు కనుగొన్నారు. శీతాకాలంలో ఇవి బాగా పూస్తాయి. కుండీల్లోనూ, నేల మీదా పెంచుకోవచ్చు.
- చిలుకూరి శ్రీనివాసరావు,
89859 45506