Nov 07,2022 00:56

సాగర్‌ నగర్‌ తీరంలో చెత్తను సేకరిస్తున్న జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున తదితరులు

ప్రజాశక్తి -మధురవాడ : తీరం స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్‌ సూచన మేరకు సాగర్‌నగర్‌ బీచ్‌లో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ, జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యాన నగరంలోని సముద్ర తీర ప్రాంతాలను పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని ప్రతి నెలా మొదటి ఆదివారం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన 6 విడతల బీచ్‌ క్లీన్‌ కార్యక్రమంలో 175 టన్నులకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్ధాలు సేకరించినట్లు చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే బీచ్‌ ప్రాంతాలను 10 సంస్థలు దత్తత తీసుకున్నాయన్నారు.
ప్రతి రోజూ సదరు సంస్థల సభ్యులు ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతిరోజూ టూరిస్టులు విశాఖలోని వివిధ బీచ్‌ ప్రాంతాల్లో సందర్శిస్తుంటూరని, వీరికి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగించకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కెఎస్‌.విశ్వనాథన్‌, జివిఎంసి కమిషనర్‌ రాజాబాబు, ఆర్‌డిఒ హుస్సేన్‌ సాహెబ్‌, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, స్థానిక ప్రజలు, హెచ్‌పిసిఎల్‌ ప్రతినిధులు, సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.