ప్రజాశక్తి - కాకినాడ
సముద్రతీర ప్రాంత భద్రతపై మత్స్యకారులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి సముద్రతీర భద్రత కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కృతికా శుక్లా, విశాఖపట్నం కోస్టల్ సెక్యూరిటీ అదనపు ఎస్‌పి జీ.బీ.ఆర్.మధుసూదన్ రావు, కాకినాడ ఎఎస్‌పి పి.శ్రీనివాస్, కస్టమ్స్, కాకినాడ సీపోర్ట్, నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, తీరప్రాంత పోలీస్ అధికారులతో కలిసి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సముద్రతీర ప్రాంతాల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని, తీర ప్రాంత భద్రతపై మత్స్యకారులకు అవగాహన కల్పించి, ఇందుకు పోలీస్, మెరైన్, నేవీ, కోస్ట్ గార్డ్, మత్స్య శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సముద్రంలో ఉన్న బోట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అవసరమైన వాచ్ టవర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సముద్రతీర భద్రతకు సంబంధించి అందుబాటులో ఉన్న బోటుల మరమ్మతు లకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు. వారంతాలు, ఇతర పండుగల సందర్భాల్లో సముద్ర స్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదా నికి గురైన ప్రజలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు నైపుణ్యం కలిగిన గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులకు సూచించారు. సమావేశంలో ఇన్‌ఛార్జ్ డీఆర్‌వో కె.శ్రీరమణి, జిల్లా మత్స్య శాఖ అధికారి పి.సత్యనారాయణ, కస్టమ్స్ సూపరింటెండెంట్ శివ కుమార్, సిపిఒ పి.త్రినాథ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ జి.యానీలా, ఐబీ డిఎస్‌పి ఎన్.నూకరాజు, మెరైన్ సిఐ సుమంత్, ఇతర అధికారులు హాజరయ్యారు.
అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ కృతికా శుక్లా










