Oct 18,2023 21:28

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న డిఐఒ జగన్మోహనరావు

ప్రజాశక్తి-సీతానగరం :  వ్యాధి నిరోధక టీకాలతో పిల్లలకు పలు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి టి.జగన్మోహనరావు తెలిపారు. మండలంలో నిడగల్లు, చిన్నరాయుడుపేట గ్రామాల్లో టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా కార్డులు, ఆర్‌సిహెచ్‌ రిజిష్టరు పరిశీలించారు. నిర్ణీత గడువు తేదీలను ఎంసిపి కార్డులో నమోదు చేసి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. వేస్తున్న ప్రతి టీకా ఆవశ్యకతను వారికి వివరించాలన్నారు. టీకా కేంద్రంలో వ్యాక్సిన్‌, అత్యవసర మందుల కిట్‌, హబ్‌ కట్టర్‌ పరిశీలించారు. హబ్‌ కట్టర్‌ వినియోగిస్తున్న విధానాన్ని పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లల వరకు ఆయా వయసు బట్టి వ్యాధినిరోధక టీకాలు షెడ్యూలు ప్రకారం వేయాలన్నారు. తద్వారా క్షయ, హెపటైటిస్‌, పోలియో, న్యూమోనియా, కోరింత దగ్గు, కంఠసర్పి, దనుర్వాతం, తట్టు, రుబెళ్ళ, అతిసార, దృష్టి సంబంధిత సమస్యలు రాకుండా రక్షణ కలుగుతుందని చెప్పారు. టీకా వివరాలు ఎప్పటికపుడు యూవిన్‌, ఆర్‌సిహెచ్‌ పోర్టల్స్‌లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ జయగౌడ్‌, వైద్య సిబ్బంది జె.గౌరి, జి.ధరణి, జె.గౌరీశ్వరమ్మ, అంగన్వాడీ సిబ్బంది ఆర్‌.సులోచన, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.