May 08,2021 07:38

   కోవిడ్‌ టీకాలపై మేథో సంపత్తి (పేటెంట్‌) హక్కులను రద్దు చేయాలనే పోరాటాన్ని వ్యతిరేకించడం ఇక ఆపేద్దామని అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌ యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ)లో కోవిడ్‌ టీకాల పేటెంట్‌ రద్దు చేయాలని భారత్‌, దక్షిణాఫ్రికా వంటి దేశాలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. వాణిజ్య సంబంధిత మేథో సంపత్తి హక్కుల (ట్రిప్స్‌)కు సంబంధించి 1995 నాటి డబ్ల్యుటిఓ ఒప్పందం ప్రకారం 'పేటెంట్‌' యజమానులకు సర్వ హక్కులు దఖలు పడతాయి. ఆ హక్కులను కాదని ముందుకెళ్లే సభ్య దేశాలపై చట్టపరమైన చర్యలకు వీలుంటుంది. అందుకనే భారత్‌, దక్షిణాఫ్రికా గత అక్టోబర్‌లోనే నివారణ మందులు, టీకాలు, చికిత్స పద్ధతులు, కోవిడ్‌ వ్యాప్తిని అడ్డుకునే ఇతర సాంకేతిక అంశాలకు పేటెంట్‌ రద్దు చేయాలని డబ్ల్యుటిఓ కు ప్రతిపాదించాయి. 100కు పైగా దేశాలు సమర్థించాయి కూడా. ఈ ప్రతిపాదనను తొలుత వ్యతిరేకించిన అమెరికా ఇప్పుడు అంగీకరించడం ఊరట. చైనా, రష్యా కూడా సానుకూలంగా స్పందించాయి. కానీ, యూరోపియన్‌ యూనియన్‌ లోని సంపన్న దేశాలు బడా ఫార్మా కంపెనీలకు వత్తాసుగా నిలుస్తున్నాయి. అమెరికా నిర్ణయంపై సవాలు చేస్తామంటూ ఇప్పటికే 'పెట్టుబడి' స్వరాలు ఆలపిస్తున్నాయి. ప్రపంచ ప్రజల ఆరోగ్యం కంటే కార్పొరేట్‌ కంపెనీల లాభాలే ముఖ్యమనడం సిగ్గుచేటు.
   ప్రపంచ జనాభాలో కోవిడ్‌ మొదటి డోసు తీసుకున్నవారి శాతం కనీసం 8 శాతానికి మించలేదు. కోవిడ్‌ టీకాలు తీసుకున్నవారిలో 80 శాతం మంది మొదటి పది సంపన్న దేశాలకు చెందినవారే. దీనర్థం టీకాలన్నీ సంపన్న దేశాలే కొనేశాయని కాదు. 'పేటెంట్‌' బంధనాలతో మిగిలిన దేశాలకు తగిన డోసులు అందుబాటు లోకి వచ్చే పరిస్థితి కూడా లేకపోవడమే. కోవిడ్‌ టీకాలను ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని, సాంకేతికతను పంచుకునేందుకు నిరాకరించడం ద్వారా ఫార్మా కంపెనీలు సృష్టించిన కృత్రిమ కొరత ఇది.
   వాస్తవానికి టీకాల రూపకల్పన కోసం ఫైజర్‌, మోడెర్నా లాంటి ఫార్మా కంపెనీలన్నీ ప్రభుత్వాల నుంచి భారీగా రాయితీలు పొందినవే. ప్రభుత్వ రంగ పరిశోధకుల క్షేత్రస్థాయి కృషిని కూడా యథేచ్ఛగా వాడుకున్న ఈ కంపెనీలు ఇప్పుడు టీకాలపై తమదే గుత్తాధిపత్యం ఉండాలనే 'పేటెంట్‌' శాడిజం ప్రదర్శిస్తున్నాయి. టీకాలన్నీ తమ అధీనంలోనే ఉత్పత్తి అవ్వాలనీ, లేదా తాము ఎంచుకున్న కొన్ని కంపెనీల్లోనే ఉత్పత్తి చేయాలంటూ డబ్ల్యుటిఓ 'ట్రిప్స్‌' ఒడంబడికను అడ్డుపెట్టుకొని ప్రజారోగ్య హక్కులను కాలరాస్తున్నాయి. కోవిడ్‌ నివారణ పద్ధతులను స్వచ్ఛందంగా పంచుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఒక వేదికను ఏర్పాటు చేస్తే ఒక్కటంటే ఒక్క ఫార్మా కంపెనీ కూడా ముందుకు రాలేదు. లాభాలు దండుకోవడమే లక్ష్యమైన కంపెనీలు అలాంటి వేదికలను పంచుకుంటాయా ?
   టీకాలపై పేటెంట్‌ రద్దు అయితే అనేక కొత్త టీకా వెర్షన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుత వ్యాక్సిన్ల కారణంగా కలుగుతున్న ఇన్ఫెక్షన్లు, సైడ్‌ ఎఫెక్ట్స్‌, ఇతర అవరోధాలను తగ్గించే సాంకేతికతలను రూపొందించే అవకాశాలు పెరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ధర తగ్గి పేదలకు, పేద దేశాలకూ అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు బడా ఫార్మా కంపెనీలు అడ్డుకుంటున్నది ఈ ప్రయోజనాలనే.
   నిప్పును కనిపెట్టినవాడో లేదా చక్రం కనిపెట్టినవాడో వాటిపై మేధో సంపత్తి హక్కులు పొందివుంటే మన సమాజం ఈ దశకు చేరేదా? ఒక్కరి వల్లనో, లేదా ఒక బృందం వల్లనో మాత్రమే ప్రత్యేక ఆవిష్కరణ ఏదీ సాధ్యపడదు. ప్రతి ఆవిష్కరణలోనూ మానవాళి సమిష్టి భాగస్వామ్యం ఇమిడే వుంటుంది. సార్వత్రిక శాస్త్ర పరిజ్ఞానంపై గుత్తాధిపత్యం సాధించేందుకు పెట్టుబడిదారీ ప్రపంచం ఆవిష్కరించిన దోపిడి విధానాల్లో 'పేటెంట్‌' ఒకటి. పేద, మధ్య తరగతి దేశాలను నిలువునా దోచుకోవడానికి 'పేటెంట్‌' సృష్టించుకొని నిలువు దోపిడి చేసే ఎత్తుగడ అది.
   కోవిడ్‌ను కట్టడి చేయాలంటే టీకాలను సార్వత్రికం చేయాలనీ, స్వేచ్ఛాయుత విస్తృత పరిశోధనలకు అవకాశం కల్పించి ప్రపంచ జనులందరికీ టీకాలు చౌకగా, వేగంగా అందేలా దేశాలన్నీ నడుం బిగించాలని క్యూబా లాంటి దేశాలు 'పీపుల్స్‌ వ్యాక్సిన్‌' కోసం ఇప్పటికే పిలుపునిచ్చాయి. ప్రపంచ ప్రజలందరికీ టీకాలను అందుబాటులోకి తేవడం తక్షణావశ్యం. ఆ దిశగా ప్రపంచ దేశాలన్నీ అడుగేస్తాయని, సార్వత్రిక ఉచిత టీకాను అందుబాటు లోకి తీసుకొస్తాయని ఆశిద్దాం.