Apr 23,2021 07:06

   రోనా టీకాను కేంద్ర ప్రభుత్వానికిచ్చే రేటుకన్నా దాదాపు మూడింతల అధిక ధరను రాష్ట్ర ప్రభుత్వాల నుండి వసూలు చేస్తామనడం దారుణం. దేశ ప్రజలందరికీ అవసరమైన టీకాను కొనుగోలు చేసి ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యతను విడనాడిన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వివక్షాపూరిత విధానానికి తెర తీయడం తగని పని. కరోనా పరిస్థితులపై ప్రధాని మోడీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రారంభమౌతుందని, ప్రజల ప్రాణాలను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని ఘనంగా చెప్పారు. అయితే, వ్యాక్సిన్‌ ధరలను నిర్ణయించే స్వేచ్ఛను ప్రైవేటు ఉత్పత్తిదార్లకిస్తున్నట్లు ప్రధాని చెప్పడంలో మర్మముందని కొందరు సందేహించారు. ఆ ప్రసంగానికి ముందుగా ఆయన వ్యాక్సిన్‌ ఉత్పత్తిదార్లతో సమావేశమై, వారి చర్చల్లో 'కుదిరిన' ఒప్పందం మేరకే అలా ప్రకటించినట్టు ఇప్పుడు బోధపడుతోంది. ప్రధాని ప్రసంగించిన మరుసటి రోజునే కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తన ధరలను ప్రకటించింది. ఒక మోతాదు వ్యాక్సిన్‌ను రాష్ట్ర్ర ప్రభుత్వాలకు రూ.400కు, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600కు విక్రయిస్తామని, కేంద్ర ప్రభుత్వానికి మాత్రం 150 రూపాయలకే లభిస్తుందని పేర్కొంది. 'ఒక దేశం-ఒకే పన్ను- ఒకే భాష-ఒకే మతం...' ఇలా చెప్పే పాలకులు ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్‌కు మాత్రం ఇన్ని రకాల రేట్లెందుకు నిర్ణయిస్తున్నారు? వ్యాక్సిన్‌ కొరత వెంటాడుతుంటే కేంద్ర ప్రభుత్వం సరఫరాలను పెంచకుండా, అమ్మకాలను సరళీకరించడం, ధరలపై నియంత్రణను ఎత్తివేయడం కార్పొరేట్ల లబ్ధి కోసమేనన్నది సుస్పష్టం.
    వాస్తవానికి నేడు దేశంలో నెలకొన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితులను అధిగమించడానికి సార్వత్రిక, సామూహిక వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలి. ప్రజలకు సామూహికంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉచితంగా, సార్వత్రికంగా చేపట్టడం స్వతంత్ర భారతావని వారసత్వం, సాంప్రదాయం. మసూచి మొదలు పోలియో నుండి ఇటీవలి పెంటావెలెంట్‌ వ్యాక్సిన్‌ వరకూ మన దేశ విధానమిదే! కాని, కేంద్రం ప్రకటించిన కొత్త విధానం ఆరోగ్య సంక్షోభం నుండి ప్రజలను బయటపడేయాల్సిన బాధ్యత నుండి తాను తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలా అనిపిస్తోంది. తన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టివేసేందుకు చూస్తోంది. వ్యాక్సిన్‌ను తీసుకోలేని కోట్లాదిమంది ప్రజలను గాలికొదిలేయాలని చూసే అమానుష విధానమిది. వ్యాక్సిన్లు ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఉచితంగా అందుతున్నాయి. కానీ ఇప్పుడు, ఎలాంటి ధరల నియంత్రణ లేకుండా బహిరంగ మార్కెట్‌లో రాష్ట్రాలు వ్యాక్సిన్లను 'సమకూర్చుకోవాలని' చెప్పడం ఎలాంటి సహకార ఫెడరలిజమో కేంద్ర పాలకులు వివరించాలి. ఎప్పటి మాదిరిగా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయాలి. లేదా కేంద్ర ఖజానా నుండి నిధులు అందచేయాలి. పి.ఎం కేర్స్‌ నిధికి వచ్చిన సొమ్మును ఇందుకు కేటాయించవచ్చు.
   కేరళ ప్రజలందరికి తమ ప్రభుత్వం వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించడం హర్షణీయం. ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికి ప్రజల పట్ల గల నిబద్ధతకు ఇది మరో నిదర్శనం. తమకు మాట తప్పే అలవాటు లేదని, అప్పుడూ ఇప్పుడూ ఒకే మాట చెబుతామని మీడియాతో విజయన్‌ అన్న మాటలు కమల నాథులకు శూలాల్లా గుచ్చుకోవచ్చు. దేశమంతటా ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన నేపథ్యంలో బిజెపి మాదిరి రాజకీయ వివక్ష లేకుండా గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు కేరళ ప్రభుత్వం సరఫరా చేయడం ప్రశంసనీయం. తెలుగు ప్రజల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటుకు కట్టబెడతానని మోడీ సర్కారు ప్రకటించగా ఇప్పుడు ఆ స్టీల్‌ ప్లాంట్‌ నుండి అనేక రాష్ట్రాలకు ప్రాణవాయువు సరఫరా కావడం ప్రభుత్వరంగ సంస్థల ఔదార్యానికి మచ్చు తునక. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కరోనా టీకాను దేశ ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా అందజేయాలి. అదే భారత్‌ వ్యాక్సిన్‌ విధాన వారసత్వం.