ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : సార్వత్రిక టీకా కార్యక్రమంలో నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు ఆయన 13వ వార్డులో (బైపాస్ కాలనీ) వైద్య సిబ్బంది నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా కార్డులు, ఆర్సిహెచ్ రికార్డులు, టీకా పొందుతున్న చిన్నారుల, గర్భిణీలు వివరాలతో పాటు టీకా కేంద్రంలో ఉండాల్సిన అత్యవసర మందుల కిట్ హబ్ కట్టర్, ఉపయోగించిన సిరంజీలు, అలాగే వ్యాక్సిన్ వయల్స్ స్థితి తదితర వాటిని తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. టీకా గడువు తేదీలను పరిశీలించి అక్కడ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి ముందస్తు సమాచారం సిబ్బంది ఇస్తున్నారా అని ఆరా తీశారు. వేస్తున్న ప్రతి టీకా ఆవశ్యకతను, అవి నిరోధించే వ్యాధులను తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్ వైజర్స్ పుష్ప ,సత్తిబాబు, ఎఎన్‌ఎమ్ సునీత, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.










